ప్రతి గుడిసెకు పట్టా ఇవ్వాల్సిందే
పేదలందరికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలి
పోడు భూములకు పట్టాలివ్వాలి
పోరాటాలు ఉధృతం చేస్తాం : మహాధర్నాలో వామపక్ష నేతల హెచ్చరిక
గుడిసెల జోలికొస్తే ఖబర్దార్ అంటూ కమ్యూనిస్టులు కన్నెర్రజేశారు. పేదలు వేసుకున్న గుడిసెలను పీకేస్తే… ప్రభుత్వాన్నే పీకేస్తామని హెచ్చరించారు. డబుల్ బెడ్ రూమ్‌లు, ఇండ్లు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో హామీలిస్తున్న పార్టీలు… ఆ తర్వాత ఆ వాగ్దానాలను బుట్టదాఖలు చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిసెలు, పోడు భూములకు పట్టాలివ్వాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వామపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్ సర్కారును హెచ్చరించారు. ఆ పార్టీల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాకు పేదలు, గుడిసెవాసులు పోటెత్తారు. కిక్కిరిసిన ధర్నాచౌక్ ప్రాంతాలన్నీ రాష్ట్రంలో గుడిసెవాసుల కష్టాలను, నిలువనీడలేని పేదల బాధలను గుర్తు చేశాయి. వారి సమస్యలను పరిష్కరించకపోతే గత బీఆర్‌ఎస్ సర్కారుకు పట్టిన గతే.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికీ పడుతుందని నేతలు హెచ్చరించారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పేదలతో పెట్టుకుంటే ప్రభుత్వానికి పుట్టగతులుండబోవని వామపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. వారి జోలికొస్తే గత బీఆర్ఎస్, ఇతర ప్రభుత్వాలకు పట్టిన గతే రేవంత్ రెడ్డి సర్కారుకూ పడుతుందని వారు హెచ్చరించారు. ప్రతి గుడిసెకూ, పోడు భూములకూ పట్టాలివ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాల్సిందేనని, లేదంటే పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల్లోని పేదల గుడిసెలను కూల్చివేయొద్దు, రాష్ట్రంలోని పేదలకు భూదాన్, ప్రభుత్వ భూములను కేటాయించాలనే డిమాండ్లపై సోమవారం హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్‌డీ అబ్బాస్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహా, వామపక్షాల నాయకులు వనం సుధాకర్ (ఎంసీపీఐ), కె.గోవర్థన్ (సీపీఐ ఎంఎల్-న్యూ డెమోక్రసీ), సదానంద్ (సీపీఐ ఎంఎల్-మాస్ లైన్), భరత్ (ఎస్‌యుసీఐ) అధ్యక్షవర్గంగా వ్యవహారించారు. సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ ఎంఎల్-న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని వెంకటేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర నాయకులు హన్మేశ్, ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, ఎస్‌యుసీఐ (సి) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్. మురహరి తదితరులు ప్రసంగించారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ గతంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని మోసం చేసిన బీఆర్ఎస్ సర్కారుకు పేదలు బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. ఇదే రకంగా ఎన్నికలకు ముందు పేదలకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ తన రెండున్నరేండ్ల పాలనలో గుడిసెలకు పట్టాలివ్వలేదని విమర్శించారు. అందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలిస్తామనే హామీని నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 30 లక్షల పేద కుటుంబాలకు ఇండ్లు లేవనేది రాష్ట్ర ప్రభుత్వ సర్వేలోనే వెల్లడైందని చెప్పారు. 14 లక్షల మందికి ఇండ్ల స్థలాలున్నా నిర్మాణానికి ప్రభుత్వం డబ్బులివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 11 లక్షల మందికి ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేవని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 60 శాతం మందికి పైగా అద్దె ఇండ్లలో ఉంటున్నారని తెలిపారు. బడాబాబులు రూ.వందల కోట్ల విలువైన భవంతుల్లో ఉంటుంటే…
పేదలకు కనీసం చిన్నపాటి ఇల్లు కూడా ఉండకూడదా? అని ఆయన ప్రశ్నించారు. కొనుగోలు శక్తి లేక, వేతనాలు సరిపోక, ఎర్రజెండా ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటే ఆ గుడిసెలను కూల్చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని కూల్చేసిన ప్రభుత్వాన్ని ఆ పేదలే కూల్చేస్తారని హెచ్చరించారు. ప్రజలను పోలీసులతో భయపెట్టొచ్చనుకుంటే అది పొరపాటేనని, వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఇల్లు, ఇంటి స్థలం, ఉపాధి అవకాశాలు, పౌష్టికాహారం లేక పేదలు, కూలీలుగానే మిగిలిపోవాలా? అని ప్రశ్నించారు. అక్కడ దేశంలో అందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తానని వాగ్దానం చేసిన ప్రధాని మోడీ ప్రజలను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆయా వర్గాలకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్… బీజేపీలాగానే జనాలను వంచించిందని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యమాన్ని మరిపించేలా రాష్ట్రంలో మరో పోరాటాన్ని చూడబోతున్నారని హెచ్చరించారు. మూసీ, ప్రభుత్వ స్థలాల్లోని నాలుగు లక్షల కుటుంబాలు నివాసాలను కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 90 శాతం పేద వర్గాల వారి ఓట్లే ఉన్నాయని వెస్లీ వివరించారు. శ్రామిక వర్గాలు సంఘటితమై, మన ఓట్లను కుల, మతాలకు అతీతంగా వేసుకుంటే మనకే అధికారం లభిస్తుందని చెప్పారు. పేదల కోసమే ఎర్రజెండా పుట్టిందనీ, శ్రామికుల రాజ్యం స్థాపించేంత వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర క్యాబినెట్ ను వెంటనే సమావేశ పరిచి పేదల ఇండ్ల సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

కూనంనేని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న భూముల వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను, భూదాన్ భూములను బడాబాబులు కబ్జాలు చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో పేదలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పెద్ద పెద్ద కబ్జాదారులను పట్టుకుని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టులు ఏ డిమాండ్ల కోసమైతే పోరాటం చేస్తారో ఆ డిమాండ్లను నెరవేరుస్తామంటూ సీఎం గతంలో హామీనిచ్చారని, దాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ఎర్రజెండాలు ఎన్ని ఉన్నా అందరికీ తల్లి కమ్యూనిస్టు పార్టీయేనని అన్నారు. ఆ ఎర్రజెండలన్నీ ఒకే జెండాగా మారి పేదల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలని ఆకాంక్షించారు. గుడిసెలు కూల్చేందుకు వస్తే పేదలు తిరగబడాలని, వారికి అండగా కమ్యూనిస్టులుగా తాము నిలబడతామని మాటిచ్చారు. ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీలను చర్చలకు పిలవాలనీ, లేకపోతే డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు.

సాదినేని మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏండ్లు గడుస్తున్నా ఇంకా 80 కోట్ల మంది రేషన్ కార్డుల ద్వారా బియ్యం తీసుకుంటున్నారంటే పాలకులు సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. . పేదల గుడిసెలు, ఇంటి పట్టాల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం బుల్డోజర్ విధానాన్ని కొనసాగిస్తే ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు. హన్మేశ్ మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణానికి ఇచ్చే రూ.5 లక్షల సహాయం సరిపోవని, కనీసం రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. గాదగోని రవి మాట్లాడుతూ పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ. ప్రభుత్వ భూములను వేలం వేయడం ద్వారా గుడిసెవాసులను బయటకు పంపేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు..మియాపూర్, వరంగల్, నర్సంపేట తదితర ప్రాంతాల్లో పేదల భూములు, గుడిసెలు ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మురహరి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా పేదల సమస్యలు అలాగే ఉన్నాయని విమర్శించారు. సీపీఐ (ఎం) కేంద్ర కమిటి సభ్యురాలు టి.జ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలు తమకు ఇండ్లు కావాలని అడుగుతుంటే… ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ మాట్లాడుతూ, మహిళలకు ఇండ్లు ఇవ్వకుండా.. వారిని కోటీశ్వరులను ఎలా చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్య, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ తదితరులు మాట్లాడారు.



