ఏండ్ల తరబడి ఫైళ్లు పెండింగ్‌లో
పెడితే ఎలా ? : రెవెన్యూ, అటవీ అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయంలో
ఆకస్మిక తనిఖీ
16 అంశాలపై సమీక్ష
నవతెలంగాణ -కొల్లాపూర్
’ప్రజలు ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. అధికారులు ఫైళ్లను పెండింగ్‌లో పెడితే ఎలా.? ఒక టేబుల్ నుంచి మరో టేబుల్‌కు ఫైళ్లను పంపించడం పరిపాలన కాదు. ప్రజల సమస్యలకు చట్టబద్ధమైన, శాశ్వత పరిష్కారం చూపడమే పరిపాలన’ అని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ, అటవీ, భూ సమస్యలపై మంత్రి జూపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఒరిజినల్ ఫైళ్లు, నోట్ ఫైళ్లు, సంబంధిత రికార్డులను తెప్పించి ఒక్కో అంశాన్ని స్వయంగా పరిశీలించారు. ఫైళ్లు ఏ దశలో ఉన్నాయి? ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? ఎవరి వద్ద ఆగిపోయాయి? పరిష్కారానికి ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు? అంటూ సంబంధిత అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో పలుమార్లు సమీక్షలు నిర్వహించి ఆదేశాలు ఇచ్చినా అనేక అంశాలు ఇప్పటికీ అదే దశలో ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక ఫైల్ మీ వద్దకు వస్తే మరో అధికారికి పంపించి చేతులు దులుపుకోవడం కాదు. క్షుణంగా పరిశీలించి చట్టబద్ధమైన పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. ముక్కిడిగుండం, సోమశీల, రామాపురం, ఎల్లూరు, జటప్రోలు, గోపాలపురం శివారు, సింగోటం, కొల్లాపూర్, చింతలపల్లి, సోమశిలరోడ్డు, చౌటబెట్ల శివారుకు సంబంధించిన పోడు పట్టాలు, ఆర్‌ఓఎఫ్‌ఆర్, రెవెన్యూ అటవీ భూ వివాదాలు, జాయింట్ సర్వేలు, పట్టాదారు హక్కులు, లావోని పట్టాలు, భూ రికార్డుల సవరణ, ఫోడి సర్వే, పీఓటీ రెగ్యులరైజేషన్, భూభారతి, వ్యవసాయ మార్కెట్ యార్డు, హార్టికల్చర్ పాలిటెక్నిక్, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 16 అంశాలపై మంత్రి సమీక్షించారు.
అర్జిదారులను పిలిపించి.. అక్కడికక్కడే నిర్ణయం
ప్రతి అంశానికి సంబంధించిన అర్జిదారులను పిలిపించి, గ్రామ పాలనా అధికారి (జీపీఓ) నుంచి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, సర్వే అధికారులు, ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది వరకు సంబంధిత అధికారులందరూ ఒకేచోట కూర్చొని సమస్యలను పరిశీలించాలని ఆదేశించారు. ఎవరి స్థాయిలో ఏ నివేదిక ఇవ్వాలి ఎవరు ఏ చర్య తీసుకోవాలి అనే విషయాలను అక్కడికక్కడే నిర్ణయించి రికార్డు చేయాలని సూచించారు. డివిజన్ స్థాయిలో పరిష్కరించగల ఒక్క ఫైల్ కూడా పెండింగ్‌లో ఉండకూడదన్నారు. కలెక్టర్ స్థాయిలో నిర్ణయం అవసరమైన అంశాలకు పూర్తి ప్రతిపాదనలు, రికార్డులతో ఈరోజే పంపాలి. అనవసరంగా ఫైళ్లను పెండింగ్‌లో ఉంచితే సహించను అని హెచ్చరించారు. క్యాంపు కార్యాలయం నుంచి వచ్చే ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఫైళ్లను పెండింగ్‌లో ఉంచితే సహించేది లేదని హెచ్చరించారు.
ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



