పులిచింతల ప్రాజెక్టు గేట్ ఎదుట కాంట్రాక్టు కార్మికుల ధర్నా
నవతెలంగాణ- చింతలపాలెం
ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయాలని అడిగితే.. ఉన్న ఉద్యోగాన్నే తీసేస్తారా.. అంటూ సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లి గ్రామానికి చెందిన పులిచింతల ప్రాజెక్టు జెన్‌కో విద్యుత్ కేంద్రం కాంట్రాక్టు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జెన్‌కో విద్యుత్ కేంద్రం వద్ద కార్మికులు కుటుంబాలతో కలిసి ధర్నా చేశారు.
వివరాలిలా ఉన్నాయి
పులిచింతల ప్రాజెక్టు వద్ద జెన్‌కో విద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలో వజినేపల్లి గ్రామానికి చెందిన కొందరు యువకులు కూలి పనులకు వెళ్లగా, మట్టి కుప్పలు పడి ఐదుగురు మృతిచెందారు. అప్పట్లో బాధిత కుటుంబాలకు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం, జెన్‌కో యాజమాన్యం హామీ ఇచ్చాయి. కానీ, బాధిత కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాయి. అయితే ఆ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని కోరుతూ సుమారు రెండు నెలల కింద వజినేపల్లి గ్రామానికి చెందిన 12 మంది కాంట్రాక్టు ఉద్యోగులు జెన్‌కో ప్రధాన గేటు వద్ద శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరేందుకు వెళ్లారు. అందులో ఆరుగురు ఉద్యోగులను గేటు వద్దే అడ్డుకుని ‘మీ సేవలను రద్దు చేశాం. మీ స్థానంలో రామగుండం నుంచి ఆరుగురు ఉద్యోగులను తీసుకొచ్చాం’ అని చెప్పినట్టు బాధితులు ఆరోపించారు. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం జెన్‌కో గేటు వద్ద ధర్నాకు దిగారు. ‘జెన్‌కో కోసం మా కుటుంబాలు భూములు కోల్పోయాయి.. ఇంటి పెద్దలను ప్రమాదంలో కోల్పోయాం.. ఇచ్చిన హామీ మేరకు వచ్చిన ఉద్యోగాలను కూడా ఇప్పుడు లాక్కుంటే మా కుటుంబాలు ఎలా బతకాలి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఇచ్చిన హామీలను అమలు చేసి కాంట్రాక్టు ఉద్యోగాలను శాశ్వతం చేయాలని డిమాండ్ చేశారు. కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో విషయం తెలుసుకున్న చింతలపాలెం ఎస్‌ఐ పరమేష్ పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేస్తున్న ఉద్యోగులతో మాట్లాడారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించే దిశగా అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
పర్మినెంట్ చేయాలంటే.. ఉద్యోగమే తీసేశారు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



