కార్మికుల భద్రతపై రాజీ లేదు :
నీటి పారుదల శాఖ మంత్రి
ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టును 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో టన్నెల్ పనుల్లో పాల్గొంటున్న కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్.అంబెడ్కర్ సచివాలయంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన నిధులు, భూసేకరణ, సాంకేతిక, పరిపాలనా అనుమతులను వేగంగా పూర్తి చేసి పనులు నిరంతరాయంగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టన్నెల్‌తో పాటు డిండి, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, కాలువల నిర్మాణాలు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. దేవరకొండ, శ్రీశైలం రెండు వైపులా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పనులు సాగుతున్నాయని చెప్పారు. టన్నెల్ వద్ద పనిచేసే సిబ్బందిని ఇప్పటికే మూడింతలు పెంచామనీ, అదనపు యంత్రాలు, ప్రత్యేక పరికరాలు, సాంకేతిక నిపుణులను సమీకరిస్తున్నట్టు తెలిపారు. యంత్రాల రవాణా, కస్టమ్స్ అనుమతులు, సాంకేతిక సిబ్బంది నియామకం వంటి అంశాల్లో ఆలస్యం జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టన్నెల్ పనులను మరింత వేగవంతం చేసేందుకు మూడు అత్యాధునిక ఆర్మ్ బూమర్ యంత్రాలు ముంబై పోర్టుకు చేరాయనీ, ఈ నెలాఖరులోగా పనుల ప్రదేశానికి చేరుకుని నిర్మాణ వేగాన్ని మరింత పెంచనున్నాయని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. డిండి, నక్కలగండి, పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, కాలువల నెట్వర్క్ పూర్తయితేనే ఎస్ఎల్బీసీ పూర్తి ప్రయోజనాలు రైతులకు అందుతాయని మంత్రి అన్నారు. భూసేకరణ పరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఎస్ఎల్బీసీ ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీల నీటిని తరలించి 4.01 లక్షల ఎకరాలకు సాగునీరు, 618 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు సురక్షిత తాగునీరుతో పాటు పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా అందుతుందని పేర్కొన్నారు. దక్షిణ తెలంగాణ రైతాంగానికి శాశ్వత సాగునీటి భరోసా, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సురక్షిత తాగునీరు అందించి ఈ ప్రాంత అభివృద్ధికి ఎస్ఎల్బీసీ కొత్త దిశ చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. సమీక్షలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ. శ్రీధర్, టన్నెల్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా, ఈఎన్సీ వి.రమేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



