తాడిచర్ల బొగ్గు బ్లాకును కేంద్రం ఇవ్వలేదు
యూపీఏ హయాంలోనే కేటాయించారు
గోదావరి లోయలోని బొగ్గు బ్లాకులు కేటాయించాలి
-ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి వ్రికమార్క
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
సింగరేణి కాలరీస్ సంస్థకు తాడిచెర్ల-2 కోల్ బ్లాక్ కేటాయింపుపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2013లో కేటాయించిన బొగ్గు బ్లాకును మళ్లీ సింగరేణికి కేటాయిస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించడాన్ని తప్పుపట్టారు. ఇప్పటికే కేటాయించిన బొగ్గు బ్లాక్ కు కేంద్రం మంజూరు చేసింది కేవలం లీజు మాత్రమేనని స్పష్టం చేశారు. 2013 నుంచి లీజు ఇవ్వకుండా కేంద్రం జాప్యం చేసిందని విమర్శించారు. 2010 నుంచి 2012 వరకు కేంద్ర బొగ్గు శాఖకు చేసిన విజ్ఞప్తులపై స్పందిస్తూ నాటి యూపీఏ ప్రభుత్వం 2013 సెప్టెంబర్ 16న తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ ను సింగరేణి సంస్థకు కేటాయించిందన్నారు. ఈ బ్లాకులో గిరిజన భూములు ఉన్నందున వాటిని ప్రభుత్వ రంగ సంస్థలే బొగ్గును తీయాలని లేఖలో పేర్కొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని, బొగ్గు గనుల శాఖ మంత్రిని కలిసి కేటాయించిన గనికి లీజు అనుమతి ఇవ్వాలని పలు మార్లు విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ ఒత్తిడి మేరకే లీజు మంజూరు చేశారని స్పష్టం చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర లేదన్నారు. గిరిజన ప్రాంతాలు 1/70 చట్టం పరిధిలోకి వస్తాయనీ, ఇక్కడ వారు మాత్రమే భూమిపై సర్వ హక్కులు కలిగి ఉంటారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే మైనింగ్ వంటి కార్యకలాపాలు చేసుకునే హక్కు కలిగి ఉంటాయన్నారు. ఈ విష యాలు చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇల్లందు సమీపంలోని కోయ గూడెం-3 ఓపెన్ కాస్ట్ బ్లాక్ ను, మణుగూరులోని ఓపెన్ కాస్ట్ డిప్ సైడు గనిని వేలం పాటలో ప్రయివేట్ వ్యక్తులకు కేటాయిం చడం చట్ట వ్యతిరేకమన్నారు. కిషన్‌రెడ్డికి సింగరేణిపై ప్రేమ ఉంటే సంస్థ విస్తరించిన గోదావరి లోయ ప్రదేశంలో ఉన్న అన్ని బొగ్గు బ్లాకులను కేటాయించాలని కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పటికే కేటాయించిన బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలని భట్టి డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి, డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సింగరేణిపై కిషన్‌రెడ్డి తప్పుడు ప్రచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



