ఇది మా సేనలకు లభించిన ముఖ్య విజయం : జెలెన్‌స్కీ
మాస్కో : రష్యాలోని ఒమ్స్క్ నగరంలో ఉన్న అతి పెద్ద చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లను ప్రయోగించింది. ఇది సైబీరియాలోని మారుమూల ప్రాంతంలో ఉంది. ఈ దాడి కారణంగా ఉక్రెయిన్ అధీనంలో ఉన్న భూభాగం నుంచి సుమారు 2,700 కిలోమీటర్ల దూరంలో, కజకిస్తాన్‌తో రష్యా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఓమ్స్క్ రిఫైనరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఉక్రెయిన్ దాడిని ఓమ్స్క్ గవర్నర్ విటాలీ ఖొట్సెంకో ధృవీకరించారు. దాడిలో ఉక్రెయిన్ ప్రయోగించిన అనేక డ్రోన్లను రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డకున్నాయని ఆయన చెప్పారు. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అత్యవసర సేవల సిబ్బంది సహాయ కార్యక్రమాలలో నిమగ్నమయ్యారని అధికారులు తెలిపారు. ఆస్థినష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
ఈ దాడి ఉక్రెయిన్ సాయుధ దళాలకు లభించిన ముఖ్యమైన విజయంగా దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ అభివర్ణించారు. సైబీరియా కూడా ఇప్పుడు ఉక్రెయిన్ దాడుల పరిధిలోకి వచ్చిందని చెప్పారు. కాగా తాము ఆధునీకరించిన ఎఫ్‌పీ`1 డ్రోన్లు ఈ దాడులు నిర్వహించాయని, ఇవి ఉక్రెయిన్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా స్ట్రయిక్ డ్రోన్లకు ఓ రికార్డు అని రక్షణ సాంకేతిక సంస్థ ఫైర్ పాయింట్ తెలిపింది. ఈ దాడికి ముందు ఓమ్స్క్ చమురు రిఫైనరీ ఉక్రెయిన్ డ్రోన్ల పరిధిలోకి రాలేదు. ఇప్పటి వరకూ రష్యాలోని టాప్-10 చమురు రిఫైనరీలలో రెండు మాత్రమే ఉక్రెయిన్ దాడులను తప్పించుకున్నాయి. వాటిలో ఓమ్స్క్ ఒకటి. యురల్ పర్వతాలకు ఆవల అంగార్స్క్ పెట్రోకెమికల్ కంపెనీకి చెందిన చమురు శుద్ధి కర్మాగారం కూడా ఉక్రెయిన్ దాడులకు గురికాలేదు. తాజాగా దాడికి గురైన ఓమ్స్క్ కూడా యురల్ పర్వతాల ఆవలే ఉంది. ఓమ్స్క్ రిఫైనరీ గత సంవత్సరం 23 మిలియన్ మెట్రిక్ టన్నులను ప్రాసెస్ చేసింది. ఇది రోజుకు 4,60,000 బ్యారల్స్‌కు సమానం.
ఓమ్స్క్‌తో పాటు రష్యాలోని రెండు ఓడరేవులపై కూడా ఉక్రెయిన్ సేనలు మంగళవారం రాత్రి దాడులు జరిపాయి. ఈ ఓడరేవుల ద్వారానే బాల్టిక్ సముద్రం మీదుగా చమురు ఎగుమతులు జరుగుతున్నాయి. కలుగా, యారొస్‌లావీ ప్రాంతాలపై కూడా దాడులు జరిగాయని స్థానిక గవర్నర్లు తెలియజేశారు.
మూడు దేశాలతో డ్రోన్ ఒప్పందాలు
డెన్మార్క్, ఎస్టోనియా, నెదర్లాండ్స్ దేశాలతో ఉక్రెయిన్ మరో మూడు ‘డ్రోన్ ఒప్పందాలు’ కుదుర్చుకున్నదని జెలెన్‌స్కీ తెలిపారు. టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో సదస్సు సందర్భంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ఆయన ఓ పోస్ట్ పెడుతూ ఇప్పటి వరకూ తొమ్మిది డ్రోన్ ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు. 2022లో రష్యా దాడి జరిపినప్పుడు డ్రోన్ రంగంలో ఉక్రెయిన్‌కు పరిమిత అనుభవం మాత్రమే ఉంది. అయితే ఆ తర్వాత అత్యంత ఆధునికమైన డ్రోన్ పరిశ్రమను ఆ దేశం అభివృద్ధి చేసింది. ఒప్పందాల కోసం జెలెన్‌స్కీ వివిధ దేశాలలో విస్తృతంగా పర్యటించారు.
రష్యా రిఫైనరీపై ఉక్రెయిన్ దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



