– అవినీతిపై ఫ్రెంచ్ న్యాయమూర్తుల విచారణ
– సహకరించేందుకు మోడీ సర్కారు నిరాకరణ
– ఫ్రెంచ్ రాయబార కార్యాలయంతో ఎనిమిది నెలలు సంబంధాలు కట్ : మీడియాపార్ట్ సంచలన నివేదిక
రాఫెల్ డీల్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2016లో భారత్‌కు 7.8 బిలియన్ యూరోలకు దస్సాల్ట్ తయారు చేసిన 36 రాఫెల్ యుద్ధ విమానాలను విక్రయించడంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ అవినీతిపై జరుగుతున్న దర్యాప్తులో భారత్ సహాయం కోరిన ఫ్రాన్స్ న్యాయమూర్తులతో సహకరించేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు నిరాకరిస్తున్నది. ఈ సంచలన విషయాన్ని పారిస్ కేంద్రంగా పని చేసే పరిశోధనాత్మక వెబ్‌సైట్ ‘మీడియాపార్ట్’ ప్రచురించిన కొత్త నివేదిక బయట పెట్టింది. ఇప్పుడు ఈ అంశం ఇరు దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.
న్యూఢిల్లీ : భారత్‌లోని ఫ్రెంచ్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ ఈ ఏడాది జులై 25న రాసిన దౌత్య నోట్‌లో భారత్‌తో క్రిమినల్ కేసుల సహకారంలో సవాళ్లను హైలైట్ చేశారు. ”చాలా కేసులను మా భారతీయ భాగస్వాములు చాలా కాలం ఆలస్యంగా నిర్వహిస్తారు. తరచుగా అసంపూర్తిగా ఉంటారు” అని ఆయన తన నోట్‌లో పేర్కొనటం గమనార్హం. ఈ కేసులో మోడీ సర్కారు విచారణకు కట్టుబడి ఉండటం లేదని నివేదిక వివరించింది.
ఈ నివేదిక ప్రకారం.. అనుమానిత అవినీతి, ప్రభావ పెడ్లింగ్‌పై నేర పరిశోధనకు బాధ్యత వహించే ఇద్దరు ఫ్రెంచ్ న్యాయమూర్తులు గతేడాది నవంబర్‌లో చేసిన కేసుపై అంతర్జాతీయ సహకారం కోసం చేసిన అధికారిక అభ్యర్థనను అనుసరించడానికి భారత ప్రభుత్వం వాస్తవంగా నిరాకరించింది. కేంద్రం భారత్‌లోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయంతో ఎనిమిది నెలల పాటు సంబంధాలు లేకుండా చేసింది. ఫలితంగా, ఇప్పుడు బ్రెజిల్‌లో ఫ్రాన్స్ రాయబారిగా ఉన్న భారత్‌లోని ఫ్రెంచ్ రాయబారి లెనైన్..ఈ సమస్యపై దౌత్యపరమైన నోట్‌ను రాయవల్సి వచ్చింది. భారత ప్రధాని మోడీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లను ఇరికించగల అత్యంత సున్నితమైన దర్యాప్తును నెమ్మదించాలనే కోరికతో ఫ్రెంచ్, భారత ప్రభుత్వాలు ఎలా ఐక్యంగా ఉన్నాయో ‘మీడియాపార్ట్’ గతంలో సైతం నివేదించింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఛాపర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన దస్సాల్ట్ మీడియేటర్ , ప్రభావవంతమైన రక్షణ వ్యాపారి సుషేన్ గుప్తాకు సంబంధించిన న్యాయపరమైన పత్రాలను తమకు పంపాలని అక్టోబర్ 2018లో ఫ్రెంచ్ దర్యాప్తు న్యాయమూర్తులు భారత అధికారులను అభ్యర్థించారు. గుప్తా రాఫెల్ డీల్ ఏజెంట్ కూడా. అతను ”మిలియన్ల కమీషన్” అందుకున్నాడని ‘మీడియాపార్ట్’ ఏప్రిల్ 2021లో నివేదించింది. కాగా, ‘మీడియాపార్ట్’ నివేదికపై భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ సర్వీస్, భారత హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించకపోవటం గమనార్హం.