నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాలుగో టీ20 మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. ఈ ఘోర పరాజయంపై భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ సహా అన్ని విభాగాల్లో మరోసారి తమ ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యామని అంగీకరించాడు.మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. “ఈ ఓటమి చాలా నిరాశపరిచింది. 158 పరుగులు ఈ పిచ్‌పై గెలిపించే స్కోరు కాదు. ఇంగ్లండ్ బ్యాటర్లు ఎంత వేగంగా ఛేదించారో మనందరం చూశాం. బౌలర్లకు సరైన లెంగ్త్‌లో బంతులు వేయమని సూచించాను. కానీ మా ప్రణాళికలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాం” అని తన అసంతృప్తిని వెళ్లగక్కాడు.
వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, జట్టు ఓడిపోవడంతో తన ఇన్నింగ్స్‌కు విలువ లేకుండా పోయిందని అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశాడు. “నా ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నా. కానీ, అది జట్టు గెలుపునకు ఉపయోగపడనప్పుడు దానికి అర్థం ఉండదు. నేను ఆడిన ప్రతిసారీ జట్టును గెలిపించాలని కోరుకుంటాను. దురదృష్టవశాత్తు ఈ రోజు అది జరగలేదు” అని తెలిపాడు. ప్రస్తుతం భారత జట్టు ఒక పరివర్తన దశలో ఉందని, ఇలాంటి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటామని అయ్యర్ పేర్కొన్నాడు. “ఇది మాకు ఒక ట్రాన్సిషన్ ఫేజ్. ఈ దశలో తప్పులు చేయడం సహజం. అయితే, పరిస్థితులకు తగ్గట్టుగా మారడం ఎంత ముఖ్యమో మేం గ్రహించాలి. మా జట్టులో త్వరగా నేర్చుకునే ఆటగాళ్లు ఉన్నారు. వారు తమ తప్పులను సరిదిద్దుకుంటారని నమ్ముతున్నాను” అని అయ్యర్ వివరించాడు.


