Saturday, July 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువిద్యాసంస్థల బంద్‌ విజయవంతం

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

- Advertisement -

మంత్రుల నివాస సముదాయ ముట్టడి ఉద్రిక్తం
మూడంచెల భద్రత… పోలీసుల మోహరింపు క్వార్టర్స్‌‌వైపు విద్యార్థులు
దూసుకెళ్లే యత్నంలో తోపులాట
పోలీసుల అడ్డగింతతో రోడ్డుపైనే బైటాయింపు
బలవంతంగా ఎత్తుకెళ్లి వ్యాన్‌‌లో పడేసిన
పోలీసులు.. విద్యార్థి సంఘాల నేతలకు గాయాలు
ప్రభుత్వ పాఠశాలలను తగ్గిస్తే ఊరుకోం కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలి

ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలి : వామపక్ష‍ విద్యార్థి సంఘాల నేతలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలనీ, ప్రభుత్వ స్కూళ్ల మూసివేత నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ వామపక్ష‍ విద్యార్థి సంఘాలు తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌ రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైంది. అయితే, విద్యార్థి సంఘాలు హైదరాబాద్‌‌లో నిర్వహించిన మంత్రుల నివాస సముదాయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. విద్యార్థులు మినిస్టర్స్‌ ‌క్వార్టర్స్‌‌కు వెళ్లకుండా వందలాది మంది పోలీసులతో మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అటువైపు వెళ్లే ప్రతి విద్యార్థిని పోలీసులు ఆరాతీశారు. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసినప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తొలి విడతలో పదుల సంఖ్యలో విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేసుకుంటూ మంత్రుల నివాస సముదాయం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. సమీపంలోని మెయిన్‌‌రోడ్డు కమాన్‌ ‌వద్దనే బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, విద్యార్థి సంఘాల నేతలకు తోపులాట జరిగింది. విద్యార్థులంతా రోడ్డుపైనే బైటాయించారు. వారిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లేందుకు యత్నించారు.

అక్కడి నుంచి కదలడానికి వారు ససేమిరా అనడంతో పిడిగుద్దులు గుద్దుతూ…గిచ్చుతూ ఒక్కొక్కరిని నలుగురైదుగురు పోలీసులు ఎత్తుకెళ్లి వ్యాన్‌‌లో పడేశారు. ఆ వ్యాన్‌ ‌నుంచి దూకే ప్రయత్నం చేయడం, పోలీసులు బలవంతంగా డోర్లు నెట్టడంతో పలువురు విద్యార్థి సంఘాల నేతలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ఇద్దరు ముగ్గురు విద్యార్థులు ఒక్కసారిగా నినాదాలు చేసుకుంటూ పరుగులు పెట్టడంతో పోలీసులు అడ్డుతగిలి పట్టుకొచ్చి వాహనంలో పడేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మరికొందరు విద్యార్థులు నినాదాలు చేసుకుంటూ అక్కడకొచ్చారు. వారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ పలు ఠాణాలకు తరలించి సాయంత్రం వదిలేశారు. ఈ ముట్టడిలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ఏఐఎస్‌ఎఫ్‌ ‌రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌, పీడీఎస్‌‌యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్, పీడీఎస్‌‌యూ రాష్ట్ర అధ్యక్ష‍, కార్యదర్శులు పి.మహేశ్‌, పి.నాగరాజు, ఏఐఎఫ్‌‌డీఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్ష‍ులు పల్లె మురళి, ఏఐడీఎస్‌ఓ రాష్ట్ర సహాయ కార్యదర్శి నితీశ్‌, ఏఐఎస్‌‌బీ రాష్ట్ర కార్యదర్శి నవీద్‌ ‌హకీమ్‌, ఏఐపీఎస్‌‌యూ రాష్ట్ర నాయకులు గోపాల్‌ ‌మాట్లాడారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు పూర్తయినా నేటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం పట్లనే విద్యమీద ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతున్నదన్నారు.

యంగ్ ఇండియా స్కూళ్ల పేరుతో ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఆరేండ్ల నుంచి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌, స్కాలర్‌‌షిప్‌ ‌బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. మరోవైపు కార్పొరేట్, ప్రయివేటు విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతున్నప్పటికీ ప్రభుత్వం చోద్యం చూస్తుండటాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు, యూనిఫామ్‌లు అందించడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళా శాలల్లోని ఉపాధ్యాయులు, లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. అలా చేయకపోతే విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్ష‍ులు దామెర కిరణ్‌, కె.అశోక్‌ ‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్‌ ‌గువేరా, జె.రమేశ్‌, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రెహమాన్, రాష్ట్ర కమిటీ సభ్యులు అనిల్, చైతన్య యాదవ్, వంశీ వర్ధన్ రెడ్డి, పీడీఎస్‌‌యూ నాయకులు హరీష్, శ్యామ్, .కె.శ్రీనివాస్, గౌతం, పీడీఎస్‌‌యూ రాష్ట్ర ఉపాధ్యక్ష‍ులు హరీశ్, నాయకులు దీక్షిత, డాక్టర్ అశ్విని, ఏఐడీఎస్ఓ నాయకులు నాగరాజు, సిద్దార్థ్, ప్రణవ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -