Saturday, July 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపూడిక తోనే కాలాతీతం

పూడిక తోనే కాలాతీతం

- Advertisement -

ఏడాదిగా భద్రకాళి చెరువు పూడికతీత పనులు
బొంది వెంట్ల నిర్మాణం 
మరో మేడిగడ్డేనా..?
డిజైన్ల రూపకల్పన జరుగుతోంది : మధుసూదన్‌రెడ్డి, డీఈ


నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి

కాకతీయుల కాలం నాటి చారిత్రాత్మకమైన భద్రకాళి చెరువులో దశాబ్దాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పూడికతీత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 14 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక పేరుకుపోయిందని అంచనా వేయగా, ఇప్పటి వరకు సుమారు 11 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించారు. మరో 3 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. భద్రకాళి చెరువు పునరుద్ధరణ కోసం పూడికతీత పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించినా, ఇందుకు ఏడాదిగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో నీటిపారుదల శాఖ 9 లక్షల క్యూబిక్ మీటర్లు, ‘కుడా’ 3 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించింది. నీటిపారుదల శాఖ 9 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీయడానికి రూ.4 కోట్లను వెచ్చించింది. ఈ పూడిక తీత పూర్తి చేయడం వల్ల 150 ఎంసీఎఫ్‌టీల సామర్ధ్యానికి అదనంగా 40 ఎంసీఎఫ్‌టీలు పెరుగుతుంది. వెంట్‌ల నిర్మాణంలో జాప్యం జరుగుతుండటంతో బొద్దివాగు వరదతో ముంపు తప్పదన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.
భద్రకాళి చెరువు 1995కు ముందు 570 నుంచి 600 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

నాడు భద్రకాళి చెరువును తాగునీటి చెరువుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే బఫర్‌జోన్ ప్రాంతంలో ఆక్రమణదారులు చెరువు భూములను కబ్జా చేశారు. దీంతో ప్రస్తుతం చెరువు 382 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే ఉంది. చెరువు మత్తడి పనులకు గతేడాది టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఈ పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. సీఎం, ఇన్‌చార్జి మంత్రి అదేశాలతో ఎట్టకేలకు ముగ్గురు కాంట్రాక్టర్లు ఈ పనులను సంయుక్తంగా చేస్తున్నారు. భద్రకాళి చెరువు పూడిక తీసిన మట్టిని కొంత మేరకు విక్రయించగా, మిగతా మట్టిని హనుమకొండ పద్మాక్షి దేవాలయ పరిసర ప్రాంతాలు, సిద్దేశ్వర గుండం, దీన్‌దయాళ్‌నగర్ కాలనీ, అమ్మవారిపేట, రెడ్డిపురంలో ప్రభుత్వ భూములకు తరలించి చదును చేశారు. భద్రకాళి చెరువు పునరుద్ధరణకు రూ.158 కోట్లు కేటాయించారు. ఇందులో మత్తడి నిర్మాణ పనులకు రూ.30 కోట్లు, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.30 కోట్లు, బొందివాగు వెంట్‌ల నిర్మాణానికి రూ.70 కోట్లను కేటాయించారు.

మత్తడి నిర్మాణపు పనులు పూర్తయినా 8 గేట్లను నేటికీ బిగించలేదు. ఈ గేట్లు తయారీలో ఉన్నట్టు సమాచారం. భద్రకాళి చెరువులోకి బొందివాగు నుంచి వచ్చే వరద ప్రవేశించడానికి నిర్మిస్తున్న వెంట్‌ల (బిలం) నిర్మాణం విషయంలో మృత్తిక లోపాలతో తీవ్ర జాప్యం నెలకొంది. 17 మీటర్ల మేరకు డ్రిల్ చేసినా ధృడమైన మృత్తిక రాకపోవడంతో ప్రత్యామ్నా యంగా ఏం చేయాలనే విషయంలో ఇంజనీర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. బొందివాగు నుంచి వచ్చే వరద భద్రకాళి చెరువులోకి ప్రవహించడానికి ప్రస్తుతమున్న వెంట్ (బిలం) సామర్ధ్యం 2-3 వేల క్యూసెక్కుల వరద చెరువులోకి వెళ్లేలా నిర్మించారు. కొత్త ప్రతిపాదనలలో ఈ వెంట్‌ను 100 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. 9 గేట్‌లను అమర్చాలని నిర్ణయించారు. వంద మీటర్ల వెడల్పుతో వెంట్‌ను నిర్మిస్తే 20 వేల క్యూసెక్కుల వరద చెరువులోకి సులభంగా ప్రవహిస్తుంది.

రూ.70 కోట్ల పనుల్లో తీవ్ర జాప్యం
బొందివాగు వరద భద్రకాళి చెరువులోకి ప్రవేశించడానికి నిర్మించాల్సిన వెంట్ (బిలం) నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. వరంగల్ ‘నిట్‌’ ఇంజనీర్లను సంప్రదించి, వారి సలహా, సూచనలతో ఈ నిర్మాణం చేపట్టడానికి నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ‌కృషి చేస్తున్నారు. వెంట్ నుంచి రైల్వే ట్రాక్ వరకు సరళరేఖలో నాలాకు రెండు వైపులా 750 మీటర్ల మేరకు రిటైనింగ్ వాల్‌ను నిర్మించాల్సి ఉంది.

​పైల్ ఫిల్లింగ్ ట్రీట్‌మెంట్‌తో నిర్మాణం : మధుసూదన్‌రెడ్డి, డీఈ, నీటిపారుదల శాఖ
బొందివాగు వెంట్‌ల నిర్మాణానికి పైల్ ఫిల్లింగ్ ట్రీట్‌మెంట్‌తో పనులు చేపట్టాలని నిర్ణయించాం. ఈ మేరకు మరోమారు వరంగల్ ‘నిట్‌’ ఇంజనీర్లతో పరీక్షలు నిర్వహించాక తుది నిర్ణయం తీసుకుంటాం. ఏదేమైనా ఈ శీతాకాలంలో ‌బొందివాగు వెంట్ పనులను ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాం. వెంట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్‌ల రూపకల్పన పూర్తయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -