Friday, July 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమాట తప్పడం రేవంత్‌‌రెడ్డి సంస్కృతి కావొచ్చు

మాట తప్పడం రేవంత్‌‌రెడ్డి సంస్కృతి కావొచ్చు

- Advertisement -

ఒట్టేసి ఒకమాట, వేయకుండా మరోమాట చెప్పే అలవాటు నాకు లేదు : మాజీమంత్రి హరీశ్‌‌రావు
నవతెలంగాణ బ్యూరో – హై‌దరాబాద్‌
మాట తప్పడం, పార్టీలు మారడం సీఎం రేవంత్‌‌రెడ్డి రాజకీయ సంస్కృతి కావొచ్చని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు తెలిపారు. అలాంటి సంస్కృతి తనది కాదని స్పష్టం చేశారు. అందుకు 20 ఏండ్ల రేవంత్‌ రాజకీయ చరిత్ర, 25 ఏండ్ల తన రాజకీయ చరిత్రనే దానికి నిదర్శనమని పేర్కొన్నారు. శుక్రవారం ఎక్స్‌ ‌వేదికగా హరీశ్‌‌రావు స్పందించారు. ఆయనలాగా ఒట్టేసి ఒకమాట, ఒట్టు వేయకుండా మరోమాట చెప్పే అలవాటు తనకు లేదని వివరించారు. భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైందని ప్రశ్నించారు. కనీసం ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందా? సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. కన్నేపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయని ప్రభుత్వ చేతగానితనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని చూడటం హీనమైన చర్య అని విమర్శించారు. 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు చెక్కు చెదరలేదనీ, లక్ష క్యూసెక్కుల వరద వస్తున్న ప్రస్తుత సమయంలో ఏదో జరుగుతుందని భ్రమలు కల్పిస్తున్నారని తెలిపారు.

నీళ్లు ఉండి కూడా ఎత్తిపోయకుండా, రిజర్వాయర్లు నింపకుండా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వైఖరి తెలంగాణకు శాపంగా, ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారిందని పేర్కొన్నారు. ఒక వైపు ఎల్‌నినో ప్రభావం ఉన్నా తెలంగాణలో గోదావరి జలాలు గలగలా ప్రవహిస్తున్నా‌యని తెలిపారు. అయినా ఆ నీటిని ఒడిసిపట్టకుండా ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెడుతున్న రేవంత్ సర్కారు తెలంగాణకు జలద్రోహం చేస్తోందని విమర్శించారు. గోదావరిలో వరద లేదనీ, వానలు లేవని ప్రభుత్వం చెబుతోందని తెలిపారు. వరద లేకుంటే పట్టిసీమకు నీరు ఎక్కడి నుంచి వస్తోందనీ, 24 మోటార్లు నిరంతరాయంగా ఎలా నడుస్తున్నాయని ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద ప్రాణహిత నుంచి ప్రవాహం కొనసాగుతోందని వివరించారు. సొంత జిల్లాకు, సొంత ప్రజలకు న్యాయం మంత్రి ఉత్తమ్‌ ‌న్యాయం చేయలేకపోతున్నారనీ, రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షతో తెలంగాణ రైతాంగాన్ని కరువు కోరల్లోకి నెట్టడం దారుణమైన చర్య అని విమర్శించారు. బీఆర్ఎస్‌పై రాజకీయంగా పోరాడాలనీ, తెలంగాణ రైతులపై కక్ష తీర్చుకోవద్దని సూచించారు. కన్నేపల్లి పంపులను ఆన్ చేసి ఎల్లంపల్లి, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ సహా ఇతర అన్ని రిజర్వాయర్లనూ నింపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -