కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
నవతెలంగాణ–ఉస్మానియా యూనివర్సిటీ
ఓయూలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయడంతోపాటు సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఓయూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్ట్స్ కాలేజ్ నుంచి వీసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిజిస్ట్రార్ నరేష్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు టి. మహేందర్ మాట్లాడుతూ.. ఓయూలో సుమారు 425 మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నాలుగు దశాబ్దాలుగా తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. నాలుగేండ్లుగా వేతనాలు పెంచకుండా యూనివర్సిటీ యాజమాన్యం, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ సక్రమంగా అమలు చేయడం లేదని, పండుగలు, ప్రభుత్వ సెలవులు కూడా ఇవ్వకుండా పనిచేయిస్తున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ర్యాలీలో యూనియన్ ప్రధాన కార్యదర్శి వి. పద్మ, ఉపాధ్యక్షులు శ్రీధర్ రావు, టి. నరేష్, పి. శ్రీనివాస్, నాగరాజు, శివ, బాలకృష్ణ, సాయి శ్రీనివాస్, పాషా, సాయి, అనిల్, లక్ష్మిన్, పరమేష్, మధు, వీరేష్, శ్రీకాంత్, నాయకులు యాదమ్మ, అంజమ్మ, మాధవి, రేణుక, లక్ష్మి, రాధ, కవిత తదితరులు పాల్గొన్నారు.
ఓయూలో కాంట్రాక్టు కార్మికుల వేతనాలు చెల్లించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


