భద్రాచలంలో ప్రారంభ సభ
ఆగస్టు 23న చలో హైదరాబాద్
టీఎస్‌సీపీఎస్‌ఈయూ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) ఆధ్వర్యంలో శనివారం నుంచి రాష్ట్రవ్యాప్త “జన జాగరణ యాత్ర” ప్రారంభం కానుంది. శనివారం భద్రాచలం నుంచి ప్రారంభం కానుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 18 వరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగుతుందని వివరించారు. వచ్చేనెల 23న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. 2004 సెప్టెంబర్ ఒకటి నుంచి సీపీఎస్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. 22 ఏండ్లుగా లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక, సామాజిక అభద్రతను ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ జీవితమంతా కష్టపడి పనిచేసిన అనంతరం వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితం గడపలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.రిటైర్మెంట్ అనంతరం హామీతో కూడిన నెలవారీ పెన్షన్ లేదని వివరించారు. మార్కెట్‌పై ఆధారపడే పెన్షన్ విధానం కారణంగా ఎంత పెన్షన్ వస్తుందో ఉద్యోగికి ముందస్తు భరోసా లేదని తెలిపారు.
ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి సీపీఎస్ పేరుతో కోతలు పడుతున్నప్పటికీ, రిటైర్మెంట్ తర్వాత సామాజిక భద్రత లేదని పేర్కొన్నారు. కుటుంబ పెన్షన్, స్థిరమైన వృద్ధాప్య భద్రతపై అనిశ్చితి నెలకొందని వివరించారు. ఇప్పటికే ఉద్యోగ విరమణ చేసిన అనేక మంది సీపీఎస్ ఉద్యోగులు రూ.వందల నుంచి రూ.వేల వరకు మాత్రమే పెన్షన్ పొందుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగుల భవిష్యత్తు పూర్తిగా మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఓపీఎస్ వల్ల ఉద్యోగి చివరి వేతనం ఆధారంగా హామీతో కూడిన నెలవారీ పెన్షన్ జీవితాంతం అందుతుందని వివరించారు. డీఆర్ పెరుగుదలతో పెన్షన్ కూడా పెరుగుతుందని తెలిపారు. కుటుంబ సభ్యులకు కుటుంబ పెన్షన్ ద్వారా భరోసా ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగి ఉద్యోగ విరమణ తర్వాత గౌరవప్రదమైన జీవితంతోపాటు సామాజిక భద్రత, ఆర్థిక స్థిరత్వం ఉంటుందని తెలిపారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందనీ దాన్ని అమలు చేయాలని ప్రజాప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేస్తామని పేర్కొన్నారు. టీఎన్జీవో, టీజీవో, టీఎస్‌యూటీఎఫ్, పీఆర్టీయూటీఎస్, ఎస్టీయూటీఎస్, టీఆర్టీఎఫ్, తపస్, టీపీటీఎఫ్, ఎస్‌జీటీయూ, పీఆర్టీయూ తెలంగాణ మద్దతు ప్రకటించాయని తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి సంఘీభావం తెలిపి, ఈ యాత్రలో పాల్గొంటామన్నారని పేర్కొన్నారు.
సీపీఎస్ రద్దు కోసం నేటినుంచి జనజాగరణ యాత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


