Saturday, July 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచేపల ఉత్పత్తిలో అగ్రస్థానం

చేపల ఉత్పత్తిలో అగ్రస్థానం

- Advertisement -

తొలి ఆధునిక మంచినీటి 
చేపల ఎగుమతి కేంద్రం : 
మంత్రి వాకిటి శ్రీహరి
కోహెడలో ఇంటిగ్రేటెడ్ హోల్‌సేల్ చేపల మార్కెట్‌కు శంకుస్థాపన
చేప పిల్లల కొనుగోలుకు నిధులు జమ చేయాలని డిమాండ్‌
పలువురు నాయకుల అరెస్ట్‌
మత్స్య సంక్షేమానికి
కృషి
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్

​మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మత్స్యకారుల సమగ్ర సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో రూ.47.03 కోట్లతో నిర్మించనున్న ఎగుమతి ఆధారిత ఇంటిగ్రేటెడ్ హోల్‌సేల్ చేపల మార్కెట్‌కు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మత్స్యకారుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. జాతీయ మత్స్య రైతుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ముదిరాజ్‌ల సంక్షేమం కోసం అవసరమైతే మంత్రి పదవికి రాజీనామాకైనా సిద్ధమని స్పష్టం చేశారు. దేశంలోనే సముద్రతీర ప్రాంతం కాకుండా అంతర్గత రాష్ట్రంలో ఏర్పాటు కానున్న తొలి ఆధునిక మంచినీటి చేపల ఎగుమతి కేంద్రంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని ఆకాంక్ష‍ించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, ఇక్కడ ఉత్పత్తి అయ్యే చేపలకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ మార్కెట్‌లో ఆధునిక శీతల గిడ్డంగులు, శుద్ధి యూనిట్లు, ప్యాకేజింగ్ కేంద్రాలు, శిక్షణా కేంద్రం, కస్టమ్స్ సదుపాయాలు వంటి అన్ని ఆధునిక వసతులూ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సుమారు రెండు వేల మంది వ్యాపారులు వ్యాపారం నిర్వహించే అవకాశం ఉండగా, ఐదు వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..
జాతీయ మత్స్య రైతుల దినోత్సవం సందర్భంగా కోహెడలో ఏర్పాటు చేస్తున్న చేపల మార్కెట్ మత్స్యకారుల అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందన్నారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ..
అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్ నిర్మాణం చేపట్టడం ద్వారా మత్స్యకారులు, ముదిరాజ్, బెస్త సామాజిక తరగతులకు ఉపాధి, మార్కెటింగ్ అవకాశాలు కల్పించినట్టవుతుందని తెలిపారు. అదనంగా మరో రూ.50 కోట్లు మంజూరు చేసి మొత్తం రూ.100 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల, ఫ్రూట్ మార్కెట్ చైర్మెన్‌ చిలుక మధుసూధన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు దూస వెంకటేష్, ఫిషరీస్ అదనపు డైరెక్టర్ మురళీకృష్ణ, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, మత్స్యకారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
​​మంత్రికి మత్స్యకారుల ‌నిరసన సెగ
కోహెడలో చేపల మార్కెట్ శంకుస్థాపన సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరికి మత్స్యకా రుల నిరసన సెగ తగిలిం ది. చేప, రొయ్య పిల్లల కొనుగోలు కోసం మత్స్య సహకార సంఘాల ఖాతాల్లో నిధులు జమ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మత్స్యకారుల–మత్స్య కార్మికుల సంఘం (టీఎంకేఎంకేఎస్) నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దాంతో కార్యక్రమానికి ముందే సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ, రాష్ట్ర సహాయ కార్యదర్శి తేలు ఇస్తారి, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బోద్రమోని నరసింహ, తడబోయిన కృష్ణమూర్తి తదితర నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -