అసమానతలు లేని
సమాజమే లక్ష్యం : ఏఐఏడబ్ల్యూయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దళితుల హక్కుల కోసం దేశవ్యాప్త పోరాటాలు చేస్తామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ప్రకటించారు. అసమానతలు లేని సమాజ స్థాపనే లక్ష్యంగా పోరాట కార్యాచరణతో ముందుకెళ్తామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెంకట్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితుల హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. అందులో భాగమే దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఎత్తేయాలనే కుట్ర చేసిందన్నారు. దేశంలోని కార్పొరేట్లతోని ఆర్‌ఎస్‌ఎస్ కుమ్మక్కై దేశ సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు. రాముడి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చి ఆ రాముడి విరాళాలనే కొల్లగొడుతున్న తీరును ఎండగట్టారు. మోడీ సర్కారు విధానాలతో దేశ సంపద, భూములు కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నాయనీ, మరోవైపు తిండి గింజలు దొరకని పేదల సంఖ్య పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్ బియ్యాన్ని ఎత్తేయడం కోసమే ఆహార భద్రత చట్టానికి సవరణలు చేస్తున్నారన్నారు. ఇదే జరిగితే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొనే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ సంఘటితంగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కులాంతర వివాహితులపై జరుగుతున్న దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపై దాడులు చేసిన వారిని ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు పూలదండలతో ఊరేగించడమంటే రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు. రాజ్యాంగం స్థానంలో మనుధర్మాన్ని తీసుకొచ్చే కుట్ర జరుగుతున్నదని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, ఆఫీస్‌బేరర్లు, తదితరులు పాల్గొన్నారు.
దళితుల హక్కుల కోసం పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


