Saturday, July 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘చలో జవహర్ నగర్’ ఉద్రిక్తత

‘చలో జవహర్ నగర్’ ఉద్రిక్తత

- Advertisement -

జవ‌హర్‌‌నగర్‌ డంపింగ్‌ ‌యార్డు పరిశీలనకు బయలుదేరిన మహిళలు
అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు
మద్దతు తెలిపిన బీఆర్ఎస్, బీజేపీ నాయకుల అరెస్ట్
నవతెలంగాణ-కొత్తూరు

​ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్‌‌ నుంచి జవహర్‌‌నగర్‌‌ డంపింగ్‌ ‌యార్డు పరిశీలనకు చేపట్టిన ‘చలో జవహర్ నగర్’ పర్యటన ఉద్రిక్తంగా మారింది. మహిళలు, యువకులు స్వచ్ఛందంగా జవహర్ నగర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వారికి బీఆర్‌ఎస్‌, బీజేపీ ‌నాయకులు మద్దతు తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో బీజేపీ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వడ్డె బాలయ్య పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. బస్సు కదిలించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా.. పోలీసులు రోడ్ స్టాపర్‌‌తో అడ్డుకున్నారు. దీంతో మహిళలు ఆగ్రహంతో బస్సు దిగి పోలీసులతో గొడవకు దిగారు. ‘మేము ఎక్కడా ఎలాంటి ధర్నా చేయడానికి వెళ్లడం లేదు.. డంపింగ్‌‌ యార్డు ఉన్న జవహర్ నగర్ ప్రాంతం ఎలా ఉందో చూసి రావడానికి మాత్రమే వెళ్తున్నాం..’ అంటూ మహిళలు పోలీసులకు వివరించారు. ‘అక్కడ మంచిగా ఉంటే.. డంపింగ్ యార్డ్‌ను ఇక్కడ పెట్టుకుంటాం.. అక్కడ బాగా లేకపోతే ఇక్కడకు రానివ్వం’ అని మహిళలు తేల్చి చెప్పారు. తామంతా సొంతంగా డబ్బులు వేసుకుని.. కేవలం డంపింగ్‌ ‌యార్డు చూడటానికి మాత్రమే వెళుతున్నామని, తమను వదిలి పెట్టాలని పోలీసులను ప్రాధేయపడ్డారు. పోలీసులు ససేమిరా అనడంతో చివరికి పాదయాత్రగా కోళ్ల పడకల్ వైపు కిలోమీటర్ మేర నడిచి వెళ్లారు. అక్కడ కూడా పోలీసులు మహిళలను, వివిధ పార్టీల నేతలను అడ్డుకున్నారు. చివరికి చేసేదేమీ లేక పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డ, వడ్డే బాలయ్య నరేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, శ్రీధర్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో మహిళలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు వారందరినీ అరెస్టు చేసి కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -