Saturday, July 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలక్ష ఉద్యోగాలు భర్తీ చేశాం

లక్ష ఉద్యోగాలు భర్తీ చేశాం

- Advertisement -

నైపుణ్యాభివృద్ధి కోసం 
20 ఏటీసీలు
హుస్నాబాద్‌ అన్ని రంగాల్లో ముందుండాలి
విదేశీ జాబ్‌ మేళాను ఉపయోగించుకోవాలి
హుస్నాబాద్‌కు ఇంజినీరింగ్‌ కళాశాల రావడం శుభపరిణామం:
మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకట స్వామి
జాబ్‌మేళా, అభివృద్ధి
 పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-హుస్నాబాద్‌రూరల్‌

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక లక్ష ఉద్యోగాలను భర్తీ చేశామని, బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలంలోని తోటపల్లి గ్రామంలో రూ.45.15 కోట్లతో అధునాతన సాంకేతిక కేంద్రం(ఏటీసీ), మండలంలోని ఉమ్మాపూర్‌ గ్రామంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల భవన నిర్మాణాలకు మంత్రులు భూమిపూజ చేశారు. అనంతరం జాబ్‌మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ హుస్నాబాద్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ రావడం శుభపరిణామమన్నారు. తెలంగాణ వచ్చాక పదేండ్లు యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రజా పాలనలో ఇప్పటికే లక్ష ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రైజింగ్‌లో మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమితో ముందుకు పోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం 120 ఏటీసీలు ప్రారంభించాలని ప్రభుత్వం భావించిందన్నారు. ఒక్కో ఏటీసీ రూ.45 కోట్లు కాగా మొత్తం రూ.4500 కోట్లతో ఈ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ టాటా కంపెనీతో మాట్లాడి సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ ద్వారా రూ.4వేల కోట్లతో ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హుస్నాబాద్‌లో ఏటీసీ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇంజినీరింగ్‌ కాలేజీ కోసం హాస్టల్‌ నిర్మాణం కూడా జరుగుతుందన్నారు. నిరుద్యోగులకు స్కిల్‌ డెవలపమెంట్‌, ఇతర దేశాల భాషను నేర్పి విదేశాలకు పంపించడం కోసం కృషి చేస్తున్నామన్నారు. విదేశాల్లో సుమారు 5 లక్షల ఉద్యోగ అవకాశాలున్నాయని తెలిపారు. విదేశీ జాబ్‌మేళాను ఉపయోగించుకోవాలని కోరారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ హుస్నాబాద్‌లో మెడికల్‌ ‌కళాశాల పెడతామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చిన మేరకు మంజూరు చేశామన్నారు. రూ.15 కోట్లతో విద్యార్థులకు హాస్టల్‌ భవనాలు, యూనివర్సిటీ పరిపాలన అనుమతులు వచ్చాయన్నారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండో సంవత్సరం ప్రారంభం అయ్యేలోపు భవనాల నిర్మాణానికి భూమిపూజ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏడాదిలోపు భవనాలు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను కోరారు. హుస్నాబాద్‌లో పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌ కాలేజీ, ఎల్లమ్మ చెరువు పర్యాటకంగా అభివృద్ధి చెందే పనులు జరుగుతున్నాయన్నారు.
ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్ట్‌ కాలువల కోసం రూ.220 కోట్లు కేటాయించిందన్నారు. హుస్నాబాద్‌‌లో 250 పడకల ఆస్పత్రి పనులు నడుస్తున్నాయన్నారు. హుస్నాబాద్‌ ఐటీఐ ఆధునిక సాంకేతిక శిక్షణా కేంద్రంగా మారి, స్థానిక యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్‌ చైర్మెన్‌ బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి, సీపీ రష్మీ పెరుమాళ్‌, అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మీ కిరణ్‌, మున్సిపల్‌ చైర్‌‌పర్సన్‌ దండి లక్ష్మీ, మార్కెట్‌ చైర్మెన్‌ కంది తిరుపతిరెడ్డి, వైస్‌ చైర్మెన్‌ బంకచందు, మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ చిత్తారీ పద్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -