కావలసిన వస్తువులు: చిన్న కూల్‌డ్రింక్ బాటిల్, బేకింగ్ సోడా, వెనిగర్, బెలూన్, గరాటు ప్రయోగం చేసే విధానం: ప్రియమైన విద్యార్థినీ, విద్యార్థులారా! ముందుగా ఒక బెలూన్ తీసుకొని, గరాటు సహాయంతో బెలూన్‌లో రెండు స్పూన్ల బేకింగ్ సోడా పోయాలి. తర్వాత చిన్న కూల్‌డ్రింక్ బాటిల్‌లో ఒక కప్పు వెనిగర్ పోయాలి. అనంతరం, బేకింగ్ సోడా బాటిల్‌లో పడకుండా బెలూన్‌ను బాటిల్ మూతికి జాగ్రత్తగా అమర్చాలి. ఇప్పుడు బెలూన్‌ను పైకి లేపి, అందులో ఉన్న బేకింగ్ సోడా బాటిల్‌లోకి పడేలా చేయాలి. తర్వాత ఏమి జరుగుతుందో గమనించండి. ప్రయోగ వివరణ: బెలూన్‌ను పైకి లేపి, అందులో ఉన్న బేకింగ్ సోడా బాటిల్‌లోకి పడేలా చేసినప్పుడు, బెలూన్ దానంతట అదే ఉబ్బుతుంది. ఇందుకు కారణం, బాటిల్‌లో ఉన్న వెనిగర్, బేకింగ్ సోడా రసాయనిక చర్యలో పాల్గొని కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేయడం. విడుదలైన కార్బన్ డయాక్సైడ్ వాయువు బెలూన్‌లో నిండడం వల్ల బెలూన్ ఉబ్బుతుంది. రసాయనికంగా బేకింగ్ సోడాను సోడియం బైకార్బోనేట్ అని, వెనిగర్‌ను ఎసిటిక్ ఆమ్లం అని అంటారు. ఈ ప్రయోగం ద్వారా బైకార్బోనేట్లు, కార్బోనేట్లు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదల అవుతుందని, అలాగే కొన్ని రసాయనిక చర్యల వల్ల వాయువులు విడుదల అవుతాయని తెలుసుకోవచ్చు
వాలుగొండ వెంకటేశ్వర్లు,
సైన్స్ పాపులరైజర్, 9640053470
ఊదకుండానే ఉబ్బే బెలూన్
- Advertisement -
- Advertisement -



