నవతెలంగాణ – కామారెడ్డి : రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 14న రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్ని విద్యాసంస్థల బంద్‌కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు చరణ్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో రూ.11 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మంది విద్యార్థులు చదువును మధ్యలోనే మానేయాల్సి వస్తోందని, మరో 4.5 లక్షల మంది సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు గ్రీన్ ఛానెల్ ద్వారా ప్రతి నెల ఫీజులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పటికీ బకాయిలు విడుదల చేయకపోవడం బాధాకరమని విమర్శించారు. హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై లాఠీచార్జీలు చేయడం, అక్రమ కేసులు నమోదు చేయడం తగదన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని, లేనిపక్షంలో విద్యాసంస్థలు మరోసారి ఉద్యమ వేదికలుగా మారుతాయని హెచ్చరించారు. జూలై 14న నిర్వహించే రాష్ట్రవ్యాప్త బంద్‌ను విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌశిక్, పవన్, రాకేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.


