నవతెలంగాణ – నెల్లికుదురు
ప్రభుత్వ పాఠశాల మూసివేత తిరోగమన చర్య అని టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత అన్నారు. శనివారం వివిధ పాఠశాల సందర్శించి సమస్యల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ఖండించారు.నూతన పేర్లతో పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్న పాఠశాలలను రేషనలైజేషన్ పేరిట 27 వేల పాఠశాలలను 4 వేలకు కుదించడం అనేది అశాస్త్రియ విధానం అని దీనిని వెంటనే స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు తమ సర్వీస్ మొత్తంలో కనీసం ఒక్క పదోన్నతి ని కూడా పొందకుండా పదవీ విరమణ పొందుతున్నారని ,ప్రతీ ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయ పోస్టును సృష్టించి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని కోరారు.
ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఆరు డీ ఏ లు ,పి ఆర్ సి ఇవ్వకుండా దాట వేస్తూ మూడు సంవత్సరాల కాలం గడిచిందని ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం సరికాదన్నారు.వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పి ఆర్ సి ని ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బలాస్టి రమేష్ జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్, మండల అధ్యక్షులు యాకయ్య ,మండల కమిటీ సభ్యులు ప్రవీణ్ కుమార్ కరుణాకర్, మధు తదితరులు పాల్గొన్నారు.


