Monday, March 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమనువాదంపై మహిళలు తిరగబడాలి

మనువాదంపై మహిళలు తిరగబడాలి

- Advertisement -

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్‌ కన్వీనర్‌ మమత,
కేవీపీఎస్‌ ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు
కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ సెమినార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మనువాద సంస్కృతిపై మహిళలు తిరగబడాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్‌ కన్వీనర్‌ మమత, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘మనువాదం-మహిళా సమానత్వం’అనే అంశంపై సెమినార్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సంరదర్భంగా మమత, స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ విధానాలపై పోరాటం చేయడం ద్వారా మహిళా సమానత్వాన్ని సాధించాలని కోరారు. మహిళలు ఆత్మ గౌరవంతో జీవించాలన్న స్పూర్తితో మార్చి 8న అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం జరపాలని 1910లో కోపెన్‌ హెగన్‌ సదస్సు ఆమోదించిందని గుర్తు చేశారు. జర్మనీ కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్‌ ఈ కృషి చేశారని చెప్పారు. భారత్‌లో మనువాదం వేల ఏండ్లుగా మహిళను మనిషిగా చూడలేదన్నారు. ద్వితీయ శ్రేణి పౌరురాలిగా, కేవలం వంటింటి కుందెలుగా పిల్లలను కనే సాధనంగా చూసి సమాజంలో తలెత్తుకుని బతికే సమానత్వ హక్కు కల్పించలేకపోయిందని చెప్పారు. భారత రాజ్యాంగం రూపొందించిన బీఆర్‌ అంబేద్కర్‌ హిందూ కోడ్‌ బిల్లు పెట్టి మహిళా సమానత్వ హక్కులు ప్రతిపాదించారని గుర్తు చేశారు. దాన్ని అంగీకరించకపోతే కేంద్ర మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారని అన్నారు. ఓటు హక్కు పనిగంటల తగ్గింపు వంటి అనేక హక్కులు మహిళలు పోరాడి సాధించుకున్నారని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక మహిళలపైన 250 రెట్లు హింస పెరిగిందన్నారు. వారిపై లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

లైంగిక దాడులకు పాల్పడిన వారికి బీజేపీ సత్కరిస్తోందని విమర్శించారు. బిల్‌ కిస్‌ భాను కేసు, హత్రాస్‌లో మనీషా వాల్మీకి కేసు కలకత్తాలో ఓ డాక్టర్‌పై లైంగిక దాడి వంటి అనేక సంఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగాయని వివరించారు. మనువాద సంస్కృతికి వ్యతిరేకంగా స్త్రీ పురుష సమానత్వం కోసం అందరూ ఐక్యంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ శత్రువు అని చూపిస్తున్న పెట్టుబడిదారీ దుష్ట వ్యవస్థపై తిరుగుబాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం దళితులు, మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టడంలో ఘోరంగా విఫలమవుతున్నదని చెప్పారు. అనంతరం మహిళా కార్యకర్తలకు వీరనారి ఐలమ్మ జీవిత చరిత్రపై పుస్తకాలను, కేవీపీఎస్‌ డైరీని బహుకరించారు. కేవీపీఎస్‌ మేడ్చల్‌ జిల్లా ఉపాధ్యక్షురాలు పి భాగ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కాడిగళ్ల భాస్కర్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ రజనీకాంత్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్‌, కేవీపీఎస్‌ నగర కార్యదర్శి బి సుబ్బారావు, సీఐటీయూ నగర నాయకులు మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -