Monday, July 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్ అండ్‌ బీ దేశంలోనే నెంబర్ వన్‌‌

ఆర్ అండ్‌ బీ దేశంలోనే నెంబర్ వన్‌‌

- Advertisement -

 ‌గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత : రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హ్యామ్ (హెచ్ఏఎం) పథకం బీటీ రోడ్ల నిర్మాణం, నార్కట్‌పల్లి–మునుగోడు రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-యాదగిరిగుట్ట రూరల్/నార్కట్ పల్లి

​ రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖను అన్ని రంగాల్లో నెంబర్‌వన్ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం యాద్రాది భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద సుమారు రూ.358 కోట్లతో హ్యామ్ (హెచ్ ఏఎం) పథకం కింద చేపట్టనున్న పలు బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు రాయగిరి నుంచి వంగపల్లి గ్రామం వరకు దాదాపు వెయ్యి కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే, నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో రూ.76 కోట్లతో నిర్మించనున్న నార్కట్‌పల్లి–మునుగోడు సేతుబంధు (సీఆర్‌ఐ) రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. ​మెరుగైన రహదారులు, వంతెనలు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షితమైన రవాణా వ్యవస్థను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అదే క్రమంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయ్యితే ఆలేరు నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మరింత మెరుగుపడ్తాయని అన్నారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, మరిన్ని అభివృద్ధి పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. నల్లగొండ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రోడ్లు, సాగునీరు, వ్యవసాయం, తదితర రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టి జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రైతులు ఎక్కువ స్థాయిలో ధాన్యం పండిస్తున్నారని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలోనే ధాన్యం అత్యధికంగా పండించిన జిల్లా నల్లగొండ జిల్లా అని అన్నారు. నార్కట్‌పల్లి–మునుగోడు రహదారి అభివృద్ధి పనుల్లో స్థానిక రైతుల భూములకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను సైతం దశలవారీగా పూర్తి చేస్తామని చెప్పారు. రూ.600 కోట్లతో హ్యాం రోడ్లను, రూ.4000 కోట్లతో రాష్ట్రంలో అన్ని రోడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2028లో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి చేసి నార్కట్‌‌పల్లి మండల ప్రజలకు తాగు, సాగు నీరు అందిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌ ‌వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, కలెక్టర్ బి.చంద్రశేఖర్, సేతు బందు సీఆర్ఐఎఫ్ చీఫ్ వసంతనాయక్, స్థానిక సంస్థల ఇన్‌‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, నల్లగొండ ఆర్డీవో అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -