Monday, July 13, 2026
E-PAPER
Homeజాతీయంఇక ప్రయివేటు క్షిపణులు

ఇక ప్రయివేటు క్షిపణులు

- Advertisement -

కేంద్రంలోని మోడీ సర్కారు పన్నాగాలు
తొలి దశలో అస్త్ర మార్క్-2 క్షిపణులు!
ఉత్పత్తి లక్ష్యాల భారం పేరిట బీడీఎల్‌ ‌నిర్వీర్యం
రక్షణ ఉత్పత్తుల డిమాండ్ పెరగడంతో కొత్త వ్యూహమంటూ అడ్డదారి
బరిలో ఐకామ్, అదానీ, ఫోర్జ్, టాటా, మహీంద్రా
ముమ్మాటికీ దేశభద్రతకు ముప్పే : రక్షణశాఖ మాజీ సైన్యాధిపతులు

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కారు దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల్ని విక్రయిస్తుంటే..ఇపుడు కీలకమైన రక్షణ శాఖను కూడా హోల్ సేల్ గా ప్రయివేట్ సంస్థలకు కట్టబెట్టే దిశగా పావులు కదుపుతోంది. దేశ భద్రతలో కీలకమైన క్షిపణుల తయారీని కూడా కార్పొరేట్ల గుప్పెట్లోకి తీసుకెళ్లేలా కేంద్రంలోని మోడీ సర్కారు యోచిస్తోంది. ఇందులో భాగంగా దేశ రక్షణ రంగంలో మరో కీలక సంస్కరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు సమాచారం. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితమైన క్షిపణుల తయారీలో ఇకపై ప్రయివేటు సంస్థలకు కూడా అవకాశం కల్పించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారత రక్షణ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్, దేశ సాయుధ బలగాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చర్యతో స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యం పెరగడంతో పాటు రక్షణ ఎగుమతులు కూడా మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని అధికారుల వాదన. ​ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం.. రక్షణ రంగంలో ప్రయివేటు భాగస్వామ్యాన్ని క్రమంగా పెంచుతూవస్తోంది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, నౌకాదళా నికి అవసరమైన పరికరాల తయారీలో ప్రయివేటు సంస్థలకు తలుపులు తెరిచింది. ఇప్పుడు అత్యంత వ్యూహాత్మకంగా భావించే క్షిపణుల తయారీలోనూ ప్రయివేటు రంగాన్ని భాగస్వామ్యం చేయాలని కేంద్రం ప్రయత్నించడం దేశ భద్రతకు అంత ఆరోగ్యకరం కాదని రక్షణ రంగ నిపుణులు వాపోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్‌)‌ను నిర్వర్యం చేసే ఇలాంటి ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని సూచిస్తున్నారు.

డిమాండ్‌ ‌పేరుతో బుకాయింపు
ప్రస్తుతం భారత సాయుధ బలగాలతో పాటు మిత్రదేశాల నుంచి కూడా స్వదేశీ రక్షణ ఉత్పత్తులకు భారీ స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. అయితే ఆ అవసరాలన్నింటినీ ఒక్క బీడీఎల్‌ మాత్రమే తీర్చడం కష్టంగా మారుతోం‌దని కేంద్రం సాకులు చెబుతోంది. బీడీఎల్‌‌కు తగిన బడ్జెట్‌ ‌కేటాయింపులు, నియామకాలు చేస్తే ఉత్పత్తి లక్ష్యాలు అందుకోవడం పెద్ద కష్టమేమీ కాబోదని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అంతేకాని దీనిని సాకుగా చూపి క్షిపణి తయారీ వంటి కీలక విభాగాలను ప్రయివేటు రంగ సంస్థలకు కట్టబెట్టేస్తే అవి లాభాల వేటలో దేశ భద్రతను సైతం పణంగా పెట్టే దుస్థితి వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ ప్రణాళికలో భాగంగా మొదటి దశలో గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే అస్త్ర మార్క్-2 క్షిపణుల తయారీకి ప్రయివేటు సంస్థలను ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో ఐకామ్, అదానీ గ్రూప్, భారత్ ఫోర్జ్, టాటా గ్రూప్, మహీంద్రా గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.

​రెండో దశలో ‘ప్రళయ్‌’
అస్త్ర మార్క్-2 క్షిపణిని డీఆర్‌‌డీఓ అభివృద్ధి చేసింది. ఇది దృశ్య పరిధికి అవతల ఉన్న లక్ష్యాలను కూడా సమర్థంగా ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. చైనా అభివృద్ధి చేసి పాకిస్తాన్‌కు అందించిన పీఎల్‌-15ఈ దీర్ఘశ్రేణి క్షిపణికి దీటుగా ఈ క్షిపణిని రూపొందించారు. భారత వైమానిక దళంలోని తేజస్ మార్క్-1ఏ, మిగ్-29, సుఖోయ్-30 ఎంకేఐ, రఫేల్ యుద్ధ విమానాలకు ఈ క్షిపణిని అనుసంధానించనున్నారు. అస్త్ర మార్క్-2తో ప్రారంభమయ్యే ఈ ప్రయివేటు భాగస్వామ్యాన్ని తర్వాత మరింత విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది. రెండో దశలో ప్రళయ్ వంటి శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణుల తయారీలో కూడా ప్రయివేటు రంగానికి అవకాశం కల్పించే దిశగా ఆలోచనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. డీఆర్‌‌డీఓ అభివృద్ధి చేసిన ప్రళయ్ క్షిపణి అత్యాధునిక సాంకేతికతతో రూపొందింది. డబుల్ ఇంజిన్ వ్యవస్థతో పనిచేసే ఈ క్షిపణి ధ్వని వేగానికి ఆరు రెట్లు అధిక వేగంతో ప్రయాణించి సుమారు 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు.

పెరిగిన క్ష‍ిపణుల ప్రాధాన్యత
ప్రస్తుతం దేశ రక్షణ వ్యవస్థలో దీర్ఘశ్రేణి భూతల లక్ష్యాలను ఛేదించే క్రూయిజ్ క్షిపణులు, నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్, 300 కిలోమీటర్ల పరిధి కలిగిన దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాక వంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను కూడా భారత్ అభివృద్ధి చేస్తోంది. వీటితో పాటు ప్రళయ్ క్షిపణి కూడా భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఇటీవలి కాలంలో జరిగిన సైనిక పరిణామాలు కూడా క్షిపణుల ప్రాధాన్యతను మరింత స్పష్టంగా చూపించాయి. ఆపరేషన్ సిందూర్‌తో పాటు ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో క్షిపణులు, డ్రోన్లు మౌలిక సదుపాయాలపై ఎంతటి ప్రభావం చూపగలవో ప్రపంచం గమనించింది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం రక్షణతో పాటు దాడి చేసే సామర్థ్యాన్ని కూడా వేగంగా పెంచే చర్యలు చేపడుతోంది.

​రష్యా నుంచి ఐదు 
ఎస్-400 వ్యవస్థల కోనుగోలు
ఈ క్రమంలో రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన ఐదు ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థల్లో ఐదో వ్యవస్థ ఈ ఏడాది నవంబర్‌లో భారత్‌కు చేరుకోనున్నట్టు తెలుస్తోంది. అలాగే దేశ భద్రతను మరింత పటిష్టం చేసేందుకు మరో ఐదు ఎస్-400 వ్యవస్థల కొనుగోలుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలను ఆత్మాహుతి డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల దాడుల నుంచి రక్షించేందుకు రష్యాకు చెందిన పాంట్‌సిర్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా వినియోగించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -