Tuesday, March 10, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్విఙ్ఞాన వెలుగుల విప్ల‌వ జ్యోతి

విఙ్ఞాన వెలుగుల విప్ల‌వ జ్యోతి

- Advertisement -

భారతీయ సామాజిక వ్యవస్థలో శతాబ్దాలుగా దళిత, బహుజనులతో పాటు మహిళలు విముక్తికి దూరమైనారు. చారిత్రకంగా శూద్ర మహిళలు కుల వ్యవస్థతో విద్యకు నోచుకోలేదు. విద్యపై, ఆస్తిపై హక్కులేకపోవడం, బాల్య వివాహం, సతీ సహగమనం వంటి క్రూరాచారం, భర్త చనిపోతే కఠినమైన జీవితం వంటి చాందస భావాలు అగ్రకుల మహిళల పాలిట శాపంగా మారాయి. ఇవన్నీ భారతీయ మహిళల చరిత్రలో ముద్రపడ్డ చేదు వాస్తవాలు. అయితే ఈ కారు చీకట్ల నుంచి సమాజ మార్పు కోసం బయలుదేరిన ఆదర్శ మూర్తి సావిత్రిబాయి పూలే.

సావిత్రిబాయి పూలే మహిళా విముక్తి దీప్తిగా చరిత్రలో నిలిచారు. 19వ శతాబ్దపు అడ్డుగోడలను ఛేదించి తన భర్త జ్యోతిరావు పూలేకు తోడుగా నిలిచారు. ‘నా ధర్మాన్ని నేను నెరవేరుస్తానని’ మహిళలకు విముక్తి కల్పించిన సామాజిక చైతన్య దీప్తి. ఈ మాతృమూర్తి మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నాయాగవ్‌ గ్రామంలో 1831 జనవరి 3న ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. భర్త ప్రోత్సాహంతో ఇంట్లోనే విద్యావంతురాలై, అహ్మద్‌ నగర్‌లోని ఉపాధ్యాయ శిక్షణ పొందారు. అనంతరం ఆమె విద్య ఓ ఉద్యమానికి పునాది వేసింది. 1848లో పూలే బాలికల కోసం పూణేలో మొట్ట మొదటి పాఠశాలను ప్రారంభించారు. బాలికలకు విద్య బోధించడానికి వెళ్లే సమయంలో అగ్రకులాలు సావిత్రిబాయిపై రాళ్లు, చెత్త, పశువుల పేడ నీళ్ళు చల్లి తీవ్ర అవమానాలు చేసేవారు. అన్నీ భరించి మహిళల జీవితంలో వెలుగులు నింపారు.

పూలే దంపతుల సంస్కరణలు
సావిత్రిబాయి పూలే స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో ‘మహిళా సేవ మండల్‌’ సంఘాన్ని స్థాపించారు. లింగ వివక్షతకు, పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో సామాజిక అణిచివేతను, మూఢత్వాన్ని పారద్రోలి ‘సత్యాన్ని’ శోధించడానికి 1873లో భర్త మహాత్మ జ్యోతిరావు పూలేతో కలిసి ‘సత్యశోధక్‌’ సమాజాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపింది. వితంతు పునర్వివాహాల కోసం కృషి చేశారు. బాల్యంలో వైధవ్యాన్ని అనుభవించే ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోశారు. వితంతు స్త్రీల శిరోముండనంను తీవ్రంగా ఖండించి ఆపేశారు. కరువు బారిన పడి అనాధలైన పిల్లలను అక్కున చేర్చుకున్నారు. యశ్వంత్‌ రావు అనే అనాధ బాలున్ని దత్తపుత్రుడిగా పెంచుకున్నారు. జ్యోతిరావు పూలే మరణించిన్నప్పుడు చితికి నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపింది. తదుపరి సత్యసోధక్‌ సమాజ్‌ బాధ్యతలను స్వీకరించారు.

తొలి మహిళా విప్లవకారిణి
మహారాష్ట్రలోని పూణే నగరాన్ని అతలాకుతలం చేస్తున్న తీవ్ర కరువు, ప్లేగు వ్యాధిగ్రస్తులకు సావిత్రిబాయి సేవలందించారు. చివరకు ఆమె కూడా ప్లేగు వ్యాధి బారినపడి మార్చి 10, 1897లో తుది శ్వాసవిడిచారు. సావిత్రిబాయి ఫూలే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త, మహిళల హక్కుల కోసం కృషి చేసిన తొలి మహిళా విప్లవకారిణి. మరి పూలే దంపతులు ఎదుర్కొన్న అవమానాలు, త్యాగాలు, కష్టాలు ఈ తరం మహిళలకు ఎంతవరకు తెలుసు? అనేది ప్రశ్నార్థకమే. సావిత్రిబాయి పూలే అక్షర ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి ఆమె జయంతి రోజున రెండేండ్ల కిందట తెలంగాణలో ధర్మ టీచర్‌ యూనియన్‌ ఏర్పడింది. విద్యను ప్రజాస్వామీకరించాలని యుద్ధం చేస్తున్నది. ప్రస్తుతం ఆమె జయంతిని తెలంగాణ ప్రభుత్వం మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటున్నారు.

అవకాశాలు అందినప్పుడే
భారతదేశంలో చారిత్రకంగా కులవ్యవస్థ, సంప్రదాయాలు, పితృస్వామ్య ఆచారాల కారణంగా అణచివేయబడ్డ మహిళల సాధికారతకు కృషి వేసిన మొట్టమొదటి సారధులు పూలే దంపతులు, అంబేద్కర్‌. వారి కృషి వల్లనే ఈ రోజు అన్ని వర్గాల మహిళలు ఉపాధ్యాయులుగా, వైద్యులుగా, శాస్త్రవేత్తలుగా, రాజకీయ నాయకులుగా ఎదుగుతున్నారు. కానీ రాజ్యాంగం ద్వారా మహిళలకు జరుగుతున్న లబ్ధి అసమానంగానే ఉంది. కిందిస్థాయి మహిళలు ఇంకా అనేక రకాల వేధింపులకు, దాడులకు, హింసకు బలవుతున్నారు. అట్టడుగు మహిళల సమస్యలు ప్రధాన చర్చల్లోకి రావడం లేదు. గ్రామాల్లో భూమిలేకుండా జీవిస్తున్న మహిళలు, మహిళా కూలీలు, కుల హింసకు గురవుతున్న మహిళల జీవితాలు ప్రధాన స్రవంతిలో కనిపించడం లేదు. భారతదేశంలో మహిళా సాధికారత గురించి మాట్లాడినట్లయితే అన్ని వర్గాల మహిళలు ఒకే పరిస్థితిలోలేరని అర్థమవుతుంది. కులం, వర్గం, ఆర్థిక స్థితి, ప్రాంతం వంటి అంశాలు మహిళల అవకాశాలను నిర్ణయిస్తున్నాయి. కనుక విద్యా, ఉపాధి, సంపద, రాజకీయాల్లో మహిళలకు సమాన అవకాశాల లభించినప్పుడే చదువుల తల్లి సావిత్రిబాయి పూలేకు ఘననివాళి.
– సంపతి రమేష్‌, 7989579428

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -