Tuesday, March 10, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిదేశపు తొలి ఉపాధ్యాయిని సావిత్రి

దేశపు తొలి ఉపాధ్యాయిని సావిత్రి

- Advertisement -

నేడు మహిళల పట్ల సమాజంలో ఎలాంటి చిన్నచూపు ఉందో ప్రముఖులుగా చెలామణి అవుతున్న వారి మాటలు వింటే అర్థమవుతుంది. స్త్రీల వస్త్రధారణ మీద, మసులుకునే పద్ధతి మీద, అసహనంతో కూడిన వ్యాఖ్యలు ఇటీవల ఎక్కువైనాయి. దానికి కారణం మహిళలు వంటింట్లోనే మగ్గిపోకుండా చదువుకుం టున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. తమ అభిప్రాయాలను నిర్భయంగా ప్రకటిస్తున్నారు. నచ్చినట్లు బతకగల్గుతు న్నారు. దీన్ని భరించని వాళ్లు కూడా ఉంటారు. వాళ్ల మెదళ్ల నిండా పురుషాధిక్య భావజాలం నిండి ఉంటుంది. అది స్త్రీలకు స్వేచ్ఛనివ్వదు. రాజ్యాంగం చట్టబద్ధంగా ఇచ్చిన స్వేచ్ఛను కూడా ఒప్పుకోదు. ఇంత ఆధునిక కాలంలోనే ఇలా ఉంటే సావిత్రీభాయి ఫూలే కాలంలో స్త్రీల పరిస్థితి ఎలా ఉండేదో ఊహిస్తేనే ఆందోళనగా ఉంది.

1831, జనవరి 03న జన్మించిన సావిత్రీభాయికి జ్యోతిరావు ఫూలేతో తన తొమ్మిదవ యేటా అంటే వివాహం జరిగింది. ఆ కాలంలో ఇలా బాల్యవివాహాలు సర్వసాధారణం. జ్ఞానం పట్ల తపన కలిగిన సావిత్రికి అప్పటికే చైతన్యవంతుడైన ఫూలే స్వయంగా చదువు చెప్పాడు. ఆ కాలంలో బాలికలకు చదువు చెప్పే మహిళా ఉపాధ్యాయులెవరూ లేరు. ఆ లోటును తీర్చడానికి సావిత్రీ అహ్మద్‌నగర్‌లో ఉపాధ్యాయ శిక్షణ తీసుకున్నది. భర్త సహకారంతో 1848లో బహుజన బాలికల కోసం మొదటి పాఠశాలను ఏర్పాటు చేసింది. భారత దేశంలో బాలికల విద్య కోసం ఏర్పాటయిన మొట్టమొదటి పాఠశాల ఇదే. దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీ భాయి. నిజానికి ఈ దేశంలో ఉపాధ్యాయ దినోత్సవం సావిత్రిభాయి ఫూలే పేరు మీద జరగాలి. అలా జరపకపోవడం విచారకరం. అయితే ఆరోజుల్లో బహుజ నుల నుంచి మగపిల్లలే చదివే అవకాశం లేదు. అలాంటిది కింది కులాల నుంచి వచ్చిన ఆడపిల్లల కోసం పాఠశాల ఏర్పాటు చేయటమన్నది పెద్ద విప్లవం. అలా శూద్ర, అతిశూద్రుల కోసం ఒకటి కాదు రెండు కాదు దాదాపు 52 పాఠశాలలు ఏర్పాటు చేసి నిర్విఘ్నంగా చదువు చెప్పటమన్నది మామూలు విషయం కాదు. ఒక రకంగా ఒక ప్రభుత్వం చేయగలిగినంత పని ఫూలే దంపతులు చేశారు. ఇప్పుడు దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నడిచే మధ్యాహ్న భోజన పథకం సృష్టికర్తలు ఫూలే దంపతులే. ఆ కాలంలోనే వారు నడుపుతున్న పాఠశాలల్లో పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనవసతి కల్పించారు. ఎందుకంటే వారి పాఠశాల్లో చదివే పిల్లలందరూ కడుపేదరికంలో మగుతున్న కింది కులాల ప్రజలే.

కింది కులాలు బాగుపడటమన్నది సహజంగానే ఆనాటి అగ్రవర్ణాల వారికి కోపం తెప్పించింది. ఎందుకంటే కింది కులాలు చదువుకుంటే వాళ్లలో ఆలోచనాజ్ఞానం పెరుగుతుంది. తద్వారా చైతన్యం వస్తుంది. దానితో అప్పటిదాకా ఉన్న పరిస్థితి మారి బతుకులు మెరుగవు తాయి.అంటే అగ్రవర్ణాలతో సమానంగా మారే పరిస్థితులు ఏర్పడుతాయి. దాన్ని అగ్రవర్ణాలు సహించవు. వాళ్ల ఆధిపత్యం కొనసాగుతూనే ఉండాలంటే బహుజ నులలో చైతన్యం రాకూడదు. అంటే చదువుకోకూడదు. అందుకే సావిత్రీభాయి తన ఇంటినుంచి పాఠశాలకు వెళ్తున్న క్రమంలో ఆమెను అనేకరకాలుగా తిట్టిపోసే వారు. పేడనీళ్లు చల్లేవారు, బురద చల్లేవారు. కొన్ని సందర్భాల్లో భౌతిక దాడులకు కూడా దిగేవారు. ”సావిత్రి ఆడపిల్లలకు చదువు చెప్పటం ద్వారా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుంద” న్నది ఆనాటి అగ్రవర్ణాల వారి వాదన. ఆమె మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ”నా విధిని నేను నిర్వర్తిస్తున్నాను” అంటూ ముందుకు వెళ్లేది. ఈ ప్రయాణంలో తన భర్త జ్యోతిరావుతో పాటు అనేక కష్టాలు అనుభవించింది. ”సమాజం పట్ల మంచి చేయాలనే నిబద్ధత కలిగిన వారు ఎన్ని అవరోధాలు ఎదురైనా పట్టించుకోరు” అని తన జీవితాచరణ ద్వారా నిరూపించిన గొప్ప సంస్కర్త సావిత్రీభాయి ఫూలే.

కేవలం ఆనాటి ఆడపిల్లలకు చదువు చెప్పటంతోనే ఆగిపోలేదు సావిత్రి. బహుజనుల జీవితాలను చీకటి మయం చేస్తున్న అనేక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన భర్త సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహిం చింది. చదువుకోకపోవటం మూలంగా ప్రజల జీవితాలు ఎలా దీనమైన స్థితిలో మగ్గుతున్నాయో పూసగుచ్చినట్టు చెప్పింది.వితంతువుల పట్ల సమాజం అనుసరిస్తున్న అమానవీయ ధోరణిని అడ్డుకుంటూ వారి హక్కులను కాపాడటానికి ప్రయత్నం చేసింది. వాళ్లకు గౌరవప్రదమైన జీవితాన్ని దక్కటానికి పునర్వివాహాలు చేపట్టింది. వితంతు వులకు జన్మించిన శిశువులను చంపే అమాన వీయ చర్యలమీద పోరాటం చేసి పెద్దల ఆలోచనా విధానంలో మార్పు తెచ్చింది.వితంతువులను, అనాధలను అక్కున చేర్చుకొని వారి కోసం శరణాలయాలు నెలకొల్పి ఉచితంగా అన్నిరకాల వసతులు కల్పించింది. తన ఆదర్శాన్ని చాటడానికి ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి దత్తత తీసుకొని తన వారసునిగా ప్రకటించింది. తన భర్త ఫూలే ప్రారంభించిన ”సత్య శోధక్‌ సమాజ్‌” అనే సంస్థ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా నిరంతరం ప్రజల్లో అనేక విషయాలపట్ల చైతన్యం కలిగించింది. ఈ విధంగా స్వాతంత్య్రానికి వందేళ్ల ముందటి కాలంలోనే బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన సావిత్రీభాయి స్ఫూర్తి ఇంకా ఎన్నివందల ఏళ్లు గడిచినా తరిగిపోదు.
(నేడు సావిత్రీభాయి ఫూలే వర్ధంతి)
-తోకల రాజేశం,9676761415

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -