నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ భోజశాల కాంప్లెక్స్ కేసులో తుది తీర్పు వెలువడే వరకు నమాజ్ కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని ముస్లిం వర్గాలకు సుప్రీంకోర్టు సూచించింది. భోజశాల కాంప్లెక్స్ కేసులో అప్పీల్ దాఖలు చేసిన ముస్లిం వర్గాలకు మంగళవారం నోటీసు జారీ చేసింది. ఈ కేసులో ఎటువంటి స్టేటస్ కో లేదా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో తుది తీర్పు వెలువడే వరకు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 1.00గంట నుండి 3.00గంటల మధ్య నమాజ్ చేసుకునేందుకు వీలుగా తాత్కాలిక ఏర్పాటుగా వివాదాస్పద స్థలానికి సమీపంలో ఉన్న బహిరంగ ప్రదేశం లేదా ఖాళీ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించింది. వివాదాస్పద కట్టడంలో ఎటువంటి నిర్మాణపరమైన మార్పులు చేయవద్దని, సుప్రీంకోర్టు అనుమతి లేకుండా అలా చేయకూడదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్‌ఐ)ని ఆదేశించింది.
వివాదాస్పద భోజశాల కాంప్లెక్స్‌ను సరస్వతి దేవీ ఆలయంగా మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రకటించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్‌లను వెంటనే జాబితా చేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఈ కాంప్లెక్స్ 11వ శతాబ్దపు కట్టడమైన కమల్ మౌలా మసీదు అని ముస్లిం వర్గాలు వాదిస్తుండగా, సరస్వతీ దేవీ ఆలయమని హిందూ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ధార్ జిల్లాలోని ఈ కాంప్లెక్స్‌ను ప్రస్తుతం ఎఎస్‌ఐ సంరక్షిస్తోంది.



