Wednesday, July 15, 2026
E-PAPER
Homeజాతీయంమాజీ మంత్రి ముద్రగడ కన్నుమూత

మాజీ మంత్రి ముద్రగడ కన్నుమూత

- Advertisement -

ప్రత్తిపాడు : వైసీపీ సీనియర్‌ ‌నాయకులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం(73) కన్ను మూశారు. గత కొంతకాలంగా శ్వాస, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన కాకినాడ జిల్లా కిర్లంపూడిలో బుధవారం లేదా గురువారం నిర్వహించనున్నారు. ముద్రగడ మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌‌సిపి అధినేత జగన్మోహన్‌‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పిత్రుసమానులైన ముద్రగడ పద్మనాభం మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని జగన్‌ ‌పేర్కొన్నారు.

ముద్రగడ నేపథ్యం..
1953 జనవరి సీపీకిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం జన్మించారు. ఆయన తండ్రి ముద్రగడ వీరరాఘవరావు ప్రత్తిపాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రెండు సార్లు గెలుపొందారు. వీరరాఘవరావు 1977లో మృతి చెందారు. దీంతో పద్మనాభం రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో తొలిసారి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్‌టిఆర్ పిలుపు మేరకు 1982లో టిడిపిలో చేరారు. 1983, 1985లో ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు.1989లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ప్రత్తిపాడు నియోజకవర్గానికి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాకినాడ నుంచి ఒకసారి ఎంపిగా విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్‌‌టిఆర్‌, చెన్నారెడ్డి కేబినెట్ లలో మంత్రిగా పనిచేశారు. 1994లో కాంగ్రెస్‌ ‌తరఫున పోటీ చేసిన మొదటిసారి ఓడిపోయారు. 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2024 ఎన్నికల ముందు వైసిపిలో చేరారు.

కాపు ఉద్యమ నేతగా..
కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు ప్రత్యేక ముద్ర ఉంది. కాపులను బిసిల్లో చేర్చాలంటూ ఆయన ఉద్యమాలు చేశారు. 1994లో తొలిసారి తన భార్యతో కలిసి ఆమరణ దీక్షకు దిగారు. అనంతరం కాపుల రిజర్వేషన్ల కోసం మరో ఆరుసార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేశారు. 2016లో తునిలో కాపు ఐక్య గర్జన సభను నిర్వహించారు. ఈ సమయంలో ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పు పెట్టడంతో ఈ ఘటన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ‌

ముద్రగడ మరణం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, లోక్‌సభ సభ్యుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాడారని మంగళవారం ఒక ప్రకటనలో కొనియాడారు. ఆయన మరణం పట్ల సంతాపం, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
.
నమ్మిన సిద్ధాంతం కోసం రాజీలేని పోరాటం చేసిన ముద్రగడ : కేసీఆర్‌
ఆంధ్ర ప్రదేశ్‌‌కు చెందిన మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణం పట్ల, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు (కేసీఆర్‌) సంతాపం ప్రకటించారు. పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా పనిచేసిన ముద్రగడ గొప్ప ప్రజా నాయకుడనీ, ముఖ్యంగా కాపు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి గొప్పదని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -