Wednesday, July 15, 2026
E-PAPER
Homeఆటలుభారత్‌ బోణీ

భారత్‌ బోణీ

- Advertisement -

అక్షర్‌ పటేల్‌ ఆల్‌రౌండర్‌ షో
ఇంగ్లాండ్‌ 258/10, భారత్‌ 262/4
తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై గెలుపు
ఛేదనలో రాణించిన గిల్‌, సుందర్‌

నవతెలంగాణ-ఎడ్జ్‌బాస్టన్‌ : ఇంగ్లాండ్‌ పర్యటనలో టీమ్‌ ఇండియా గెలుపు ఖాతా తెరిచింది. ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ చేతిలో వరుసగా ఆరు టీ20ల్లో ఓడిన భారత్‌.. ఎడ్జ్‌బాస్టన్‌లో మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 259 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 4 వికెట్లు కోల్పోయి 45.2 ఓవర్లలోనే ఛేదించింది. ఛేదనలో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (80 రిటైర్డ్‌ హర్ట్‌, 75 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) కదం తొక్కగా.. ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌ (57 నాటౌట్‌, 52 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), వాషింగ్టన్‌ సుందర్‌ (52 నాటౌట్‌, 63 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్థ సెంచరీలు సాధించారు. మరో 28 బంతులు ఉండగానే లాంఛనం ముగించిన భారత్‌ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అంతకముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 47.5 ఓవర్లలో 258 పరుగులకు కుప్పకూలింది. జో రూట్‌ (76 నాటౌట్‌, 76 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్థ సెంచరీతో ఆదుకున్నాడు. లియాం డాసన్‌ (68, 83 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ (4/62), గుర్నూర్‌ బరార్‌ (2/61), ప్రసిద్‌ కృష్ణ (2/50) రాణించారు. భారత్‌, ఇంగ్లాండ్‌ రెండో వన్డే గురువారం కార్డిఫ్‌లో జరుగనుంది.

ఆ ముగ్గురు మెరువగా
259 పరుగుల ఛేదనలో సీనియర్‌ బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్‌ శర్మ (11) కుదురుకునేందుకు సమయం తీసుకున్నా నిరాశపరిచాడు. విరాట్‌ కోహ్లి (5) ఎదుర్కొన్న ఆరో బంతికే ఆర్చర్‌కు చిక్కాడు. కెఎల్‌ రాహుల్‌ (1) సైతం విఫలం అయ్యాడు. అయినా, శుభ్‌మన్ గిల్‌ (80) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (35)తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించాడు. గిల్‌ రిటైర్డ్‌హార్ట్ కాగా, కాసేపటికే అయ్యర్‌ రనౌట్‌, రాహుల్‌ వైఫల్యంతో భారత్‌ కష్టాల్లో కూరుకుంది. 160/4తో ఉన్న భారత్‌ను ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌ (57 నాటౌట్‌), వాషింగ్టన్‌ సుందర్‌ (52 నాటౌట్‌) నిలబెట్టారు. ఐదో వికెట్‌కు 105 బంతుల్లో అజేయంగా 102 పరుగులు జోడించారు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 బంతుల్లోనే అక్షర్‌ పటేల్‌ అర్థ సెంచరీ సాధించగా, వాషింగ్టన్‌ సుందర్‌ 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 63 బంతుల్లో ఫిఫ్టీ బాదాడు. కెప్టెన్‌కు తోడుగా ఆల్‌రౌండర్లు రాణించ టంతో సీనియర్లు నిరాశపరిచినా తొలి వన్డేలో భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్‌, టంగ్‌, కరణ్‌లు తలా ఓ వికెట్‌ తీశారు.

రాణించిన బౌలర్లు
టాస్‌ నెగ్గిన ఇంగ్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు బెన్‌ డకెట్‌ (43), జాకబ్‌ బెతెల్‌ (14) తొలి వికెట్‌కు శుభారంభం అందించారు. డకెట్‌ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో మెరువగా, బెతెల్‌ లయ అందుకునేందుకు సమయం తీసుకున్నాడు. తొలి వికెట్‌కు ఈ జోడీ 61 పరుగులు జోడించింది. ఆతిథ్య జట్టు మంచి స్కోరు దిశగా సాగుతుందని అనుకున్న తరుణంలో అరంగ్రేట పేసర్‌ గుర్నూర్‌ బరార్‌ భారత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. వరుస ఓవర్లలో బెతెల్‌, డకెట్‌ను అవుట్‌ చేసి ఇంగ్లాండ్‌కు దెబ్బకొట్టాడు. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (1) బుమ్రా అవుట్‌ చేయగా.. జోశ్‌ బట్లర్‌ (5), శామ్‌ కరణ్‌ (0)లను ప్రసిద్‌ కృష్ణ సాగనంపాడు. 60/0తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లాండ్‌.. పేసర్ల దెబ్బకు 80/4తో కష్టాల్లో కూరుకుంది. ఈ సమయంలో జో రూట్‌ (76 నాటౌట్‌) ఇంగ్లాండ్‌ను ఆదుకున్నాడు. లోయర్‌ ఆర్డర్‌లో లియాం డాసన్‌ (68)తో కలిసి ఏడో వికెట్‌కు 121 పరుగుల సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ జోడీ అర్థ సెంచరీలతో ఇంగ్లాండ్‌కు మంచి స్కోరు అందించింది. రూట్‌ అజేయంగా నిలిచినా… అక్షర్‌ పటేల్ స్పిన్‌ మాయకు లోయర్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. డాసన్‌ సహా ఆర్చర్‌ (12), ఆదిల్‌ రషీద్‌ (1), టంగ్‌ (0)లను అక్షర్‌ అవుట్‌ చేశాడు. 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఇంగ్లాండ్‌ ఆలౌటైంది.

సంక్షిప్త స్కోరు వివరాలు
ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ : 258/10 (జో రూట్‌ 76, డాసన్‌ 68, బెన్‌ డకెట్‌ 43, అక్షర్‌ పటేల్‌ 4/62, ప్రసిద్‌ కృష్ణ 2/50)
భారత్‌ ఇన్నింగ్స్‌ : 262/4 ( శుభ్‌మన్‌ గిల్‌ 80, అక్షర్‌ పటేల్‌ 57, వాషంగ్టన్‌ సుందర్‌ 52, శామ్‌ కరణ్‌ 1/55)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -