Wednesday, July 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం17న నల్లగొండలో ఏఐకేఎస్‌ జాతీయ మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం

17న నల్లగొండలో ఏఐకేఎస్‌ జాతీయ మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం

- Advertisement -


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ మహాసభల నిర్వహణ కోసం నల్లగొండలో ఈనెల 17న ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఏఐకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో ఏర్పడిన ఏఐకేఎస్ భూస్వామ్య విధానాన్ని రద్దు చేయాలనీ, దున్నేవానికి భూమి ఇవ్వాలంటూ ఆందోళనలు నిర్వహించిందని గుర్తు చేశారు. వర్లీ ఆదివాసుల పోరాటం, తెభాగ పోరాటం, పున్నప్రవాయలార్ పోరాటం, గణముక్తి పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు ఈ సంఘం నాయకత్వంలో జరిగాయని వివరించారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు పోరాట ఫలితంగా కేంద్రం ఉపసంహరించుకొందని అన్నారు. అలాంటి చారిత్రాత్మక చరిత్ర కలిగిన ఏఐకేఎస్ జాతీయ మహాసభలు తెలంగాణలో జరగడం సంతోషదాయకమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఈ ఆహ్వాన సంఘ ఏర్పాటు సమావేశాల్లో ముఖ్య అతిధిగా ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూకృష్ణన్ పాల్గొంటారని అన్నారు. రైతులు, వ్యవసాయ శాస్త్ర వేత్తలు, ప్రజా సంఘాల నాయకులు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జంగారెడ్డి, రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్, సహాయకార్యదర్శి ఉడుత రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -