చివరివారంలో పరిశ్రమకు చేరుతున్న వైనం
నూనె దిగుబడిపై ప్రభావం
ధరల విధానమే కారణమా..?
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఆయిల్ ఫెడ్ పరిశ్రమకు నెల చివరివారంలో పామాయిల్ గెలలు అధికంగా వస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి ధరల విధానమే కారణమని తెలుస్తోంది. జూన్, జులై రెండు నెలల్లోనూ చివరి వారంలోనే రైతులు అత్యధిక గెలలు పరిశ్రమకు తరలించారు. జూన్‌లో మొత్తం 11,224.165 టన్నుల గెలలు సేకరణ జరగగా, అందులో ఒక్క చివరి వారంలోనే 5,119.525 టన్నులు (45.61 శాతం) వచ్చాయి. జులైలో మొత్తం 14,471.980 టన్నుల గెలల్లో 5,511.610 టన్నులు (38.08 శాతం) చివరి వారంలోనే సేకరించారు. ఈ గణాంకాలు రైతుల్లో నెలవారీ ధరలపై నెలకొన్న అనిశ్చితిని ప్రతిబింబిస్తున్నాయి. ఈ రెండు నెలలే కాదు ప్రతి నెలా మొదటి వారం కంటే చివరి వారంలోనే పరిశ్రమకు అధిక మొత్తంలో గెలలు పరిశ్రమకు చేరుతుండటం గమనార్హం.
ధరల విధానమే కారణమా..?
ఆయిల్ ఫెడ్ ప్రతి నెల ఒకటో తేదీన తాజా ఎఫ్‌ఎఫ్‌బీ కొనుగోలు ధరను ప్రకటిస్తుంది. అయితే ఆ ధర ఆ నెలలో కోసిన గెలలకు వర్తించదు. గడిచిన నెలలో పరిశ్రమకు సరఫరా చేసిన గెలలకు మాత్రమే కొత్త ధర ప్రకారం చెల్లింపులు జరుగుతాయి. జూన్ నెలలో రైతులు సరఫరా చేసిన గెలలకు జులై 1న టన్నుకు రూ.23,783 ధర ప్రకటించారు. కానీ జులైలో కోసిన గెలలకు ఈ ధర వర్తించదు. వాటికి ఆగస్టు 1న ప్రకటించిన ధర మాత్రమే వర్తిస్తుంది. అందువల్ల ఆగస్టులో ధర పెరిగితే జులైలో గెలలు కోసిన రైతులకు లాభం తగ్గితే నష్టం వస్తుంది. దీంతో వచ్చే నెల ధర పెరిగే అవకాశముందన్న అంచనాతో రైతులు గెలల కోతను నెలాఖరు వరకు వాయిదా వేస్తున్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. ధరల నిర్ణయం అధికారుల చేతుల్లో ఉందా? అంటే అదీ లేదు. ఎఫ్‌ఎఫ్‌బీ ధరలను ఆయిల్ ఫెడ్ అధికారులు స్వేచ్ఛగా నిర్ణయించలేరు. ఆ నెలలో పరిశ్రమ ఉత్పత్తి చేసిన క్రూడ్ పామ్ ఆయిల్, పామ్ కర్నెల్ తదితర ఉప ఉత్పత్తుల విక్రయాలు, వాటి ద్వారా వచ్చిన ఆదాయం, అంతర్జాతీయ మార్కెట్‌లోని ధరల ధోరణి ఆధారంగానే రైతులకు చెల్లించే ధర నిర్ణయించబడుతుంది.
చివరి వారంలో కోతతో ప్రతికూల ప్రభావాలు
నెలాఖరులో ఒక్కసారిగా భారీగా గెలలు సేకరించడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశముంది. పూర్తిగా పరిపక్వం చెందని ఎచ్చిపచ్చి గెలలు కూడా పరిశ్రమకు వస్తుంటాయి. దాంతో ఆయిల్ రికవరీ శాతం తగ్గే ప్రమాదం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఒక్కసారిగా వేల టన్నుల గెలలు పరిశ్రమకు చేరడంతో ప్రాసెసింగ్ సామర్థ్యంపైనా ఒత్తిడి పెరుగుతుంది. రవాణాలో జాప్యం, గెలల నాణ్యత క్షీణించడం, కార్మికులపై అదనపు పనిభారం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
పరిష్కారంపై దృష్టి అవసరం..
రైతులు ధరల భయంతో నెలాఖరులోనే గెలలు కోయాల్సిన పరిస్థితి ఏర్పడకుండా అవగాహన కల్పించాలి. ధరల నిర్ణయ విధానంపై స్పష్టత ఇవ్వాలి. అదే సమయంలో గెలలు దశలవారీగా పరిశ్రమకు చేరేలా ప్రోత్సహిస్తే ఆయిల్ రికవరీ మెరుగుపడటంతో పాటు పరిశ్రమ పనితీరు కూడా సమర్థవంతంగా సాగుతుందని వ్యవసాయ, పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అధికంగా పామాయిల్ గెలల సేకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



