భారత జట్టు సహాయ కోచ్‌గా
కొనసాగేందుకు విముఖత
లండన్ (ఇంగ్లాండ్) : నెదర్లాండ్ క్రికెటర్, భారత సీనియర్ జట్టు సహాయక కోచ్ ర్యాన్ టెన్ డస్కాటె చూపు ప్రాంఛైజీలపై పడినట్టు తెలుస్తోంది. చీఫ్ కోచ్ గౌతం గంభీర్ కోచింగ్ బృందంలో అన్ని ఫార్మాట్లకు ర్యాన్ టెన్ డస్కాటె అసిస్టెంట్ కోచ్‌గా కొనసాగుతున్నాడు. అయితే, ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ అనంతరం డస్కాటె అసిస్టెంట్ కోచ్‌గా తప్పుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సహాయక కోచ్‌గా పని చేసిన డస్కాటె మళ్లీ లీగ్ క్రికెట్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ప్రాంఛైజీ క్రికెట్‌లో రెండు మాసాలే జట్టుతో ఉండాల్సి ఉండగా.. మిగతా పది నెలలు కుటుంబంతో గడిపేందుకు వీలు చిక్కుతుంది. దీంతో డస్కాటె అటువైపు చూస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. తన ఆలోచనలను గౌతం గంభీర్, బీసీసీఐతో డస్కాటె పంచుకోగా… తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డస్కాటె కాంట్రాక్టు కొనసాగించేందుకు బోర్డు సుముఖంగా ఉన్నా, అతడి వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ కాంట్రాక్టును సైతం బీసీసీఐ పొడగించేందుకు సిద్ధంగా ఉండగా.. అతడు మరో రెండేండ్లు భారత జట్టుతో ఉండనున్నాడు.



