Thursday, July 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు

- Advertisement -

సీఎం చొరవతో పరిష్కరించాలి
సమాచార్ భవన్ ఎదుట నిరసనలో టీడబ్ల్యూజేఎఫ్‌ డిమాండ్‌
వందలాదిగా తరలివచ్చిన పాత్రికేయులు ధర్నా సక్సెస్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్‌) డిమాండ్ చేసింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. నిత్యం అష్ట, కష్టాలను అనుభవిస్తున్న పాత్రికేయుల ఇబ్బందులను మానవతా దృక్పథంతో అర్థంచేసుకుని యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ లోని సమాచార శాఖ కమిషనరేట్ ఎదుట జరిగిన ధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వందలాది మంది జర్నలిస్టులు హాజరై తమ సమస్యలు పరిష్కరించాలని ప్లకార్డులు పట్టుకొని పెద్దపెట్టున నినాదాలు చేశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, ఉచిత ఆర్టీసీ బస్సు, మెట్రో రైలు పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాచార శాఖ, తెలంగాణ మీడియా అకాడమీ అక్రిడిటేషన్ కార్డుల జారీలో పక్షపాతం చూపుతున్నారని ఫెడరేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేసారు. అర్హులైన జర్నలిస్తులు అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. యూనియన్ల పేర విభజన రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. జర్నలిస్టుల పట్ల వివక్ష చెల్లదని స్పష్టం చేసారు. మీడియా అకాడమీ జర్నలిస్టులు అందరి తరపున బాధ్యత తీసుకోవాలని సూచించారు. వివక్షకు తావులేకుండా… మీడియా అకాడమీ శిక్షణా తరగతులు నిర్వహించాలని కోరారు. స్టేట్ లెవెల్ అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో దరఖాస్తులు తిరస్కరించి.. తరువాత తమకు నచ్చిన వారికే కార్డులు ఇవ్వడాన్నీ ఫెడరేషన్ తప్పు పట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వం చెల్లదని హెచ్చరించింది. ధర్నాకు అధ్యక్షత వహించిన ఫెడరేషన్ రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రెడిటేషన్ కమిటీల్లో అనధికారికంగా నియమించిన వారిని తొలగించాలనీ, ఈ విషయంపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పదవుల్లో ఉన్న పెద్దమనుషులు మీడియాకు, ప్రభుత్వానికి గుర్తింపు వచ్చేలా వ్యవహరించాలి కానీ, బద్నాం చేసేలా నడుచుకోవద్దాని ఫెడరేషన్ హితవు పలికింది. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగా ఫ్యూచర్ సిటీలో ఇండ్ల స్థలాల ప్రక్రియ ను ప్రారంభించాలనీ, క్యాబినెట్ సబ్ కమిటీకి తగిన ఆదేశాలివ్వాలని ముఖ్యమంత్రిని ఫెడరేషన్ నాయకులు కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. ఉచితంగా ఆర్టీసీ బస్సు, మెట్రో రైలు పాసులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే పాసుల పునరుద్ధరణకు సంబంధించి కేంద్రం పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలనీ, ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలని కోరారు. నిరసన కార్యక్రమానికి పలు జిల్లాల నుంచి జర్నలిస్టులు హాజరయ్యారు. ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఎల్గొయి ప్రభాకర్, తాటికొండ కృష్ణ, బి రాజశేఖర్ మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో జాప్యం సరికాదన్నారు. డీజేఎఫ్ టి ప్రధాన కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ, డెస్క్ జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో అక్రిడిటేషన్లు ఇవ్వాలని కోరారు.ఉపాధ్యక్షులు గుడిగ రఘు, కార్యదర్శులు ఈ చంద్రశేఖర్, గండ్ర నవీన్, మాణిక్ ప్రభు, సలీమా, నిరంజన్,వెంకటేష్, దామోదర్, హెచ్‌‌యూజే అధ్యక్షులు బి అరుణ్‌‌కుమార్‌. కార్యదర్శి బి.జగదీశ్వర్‌, ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, శ్రీనివాస రెడ్డి, నాయకులు దువ్వా సాగర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శేరిబాయి గణేష్, మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లేష్ గౌడ్, రవి నాయక్, నాయకులు హరి ప్రసాద్, సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఐ రాంబాబు, బి రాంబాబు,నాగర్ కర్నూల్ కార్యదర్శి వెంకటస్వామి, నాయకులు రాంచందర్, వనపర్తి అధ్యక్షుడు రాము, నాయకులు జ్ఞానేశ్వర్, జోగులాంబ గద్వాల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు జాన్, నాయకులు రంగముని, ఫెడరేషన్ నాయకులు శశికళ, విజయ, మణిమాల. రాణి, రేణయ్య, రమాదేవి, భాస్కర్, జే ఎన్ జే నాయకులు అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -