- కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ జైరాం రమేష్
నవతెలంగాణ-హైదరాబాద్: శీతకాల పార్లమెంట్ సమావేశాల్లో అయోధ్య విరాళాల స్కాంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ జైరాం రమేష్ అన్నారు. అయోధ్యలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు సృష్టించిన కుంభకోణం అంశాన్ని తాము ఖచ్చితంగా లేవనెత్తుతాము, NEET-UG 2026 పేపర్ లీక్ వ్యవహారం, విద్యా విధానానికి సంబంధించిన ఆందోళనలను కూడా కాంగ్రెస్ లేవనెత్తుతుందని ఆయన తెలియజేశారు. E-20 ఇథనాల్ వ్యవహారంపై ఖచ్చితంగా చర్చను కోరతామన్నారు. అదే విధంగా చైనా, అమెరికాలతో సంబంధాలు, పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో సహా భారతదేశ విదేశాంగ విధానంపై కూడా సభలో చర్చ జరగాలని డిమాండ్ చేస్తామన్నారు.
‘చైనా, అమెరికా, పశ్చిమాసియాతో ఇండియా సంబంధాలపై చర్చించాల్సిన అవసరం ఉందని, గత ఒకటి రెండు నెలలుగా పశ్చిమాసియాలో పరిస్థితులు క్షీణిస్తున్నాయి. అమెరికా సహకారంతో పాకిస్థాన్ పోషిస్తున్న కొత్త పాత్ర మన విదేశాంగ విధానానికి ఖచ్చితంగా ఒక పెద్ద షాక్ లాంటిది, దీనిపై పార్లమెంటులో చర్చ జరగాలి,” అని ఆయన అన్నారు.
“ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది, కానీ సమావేశాల్లో కేవలం బిల్లులు మాత్రమే ఆమోదించబడతాయి – ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై చర్చ మాత్రం ఎప్పుడూ జరగదు అనేది మా అనుభవం,” అని ఢిల్లీ మీడియా సమావేశంలో చెప్పారు. కాగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుండి ఆగస్టు 13 వరకు జరగనున్నాయి.
అంతకుముందు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) చైర్‌పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన గురువారం ఒక వ్యూహాత్మక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇతర పార్టీ నాయకులు హాజరయ్యారు. శీతకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదిసే అంశాలపై సుదీర్ఘ చర్చలు సాగించారు. ఈ మేరకు మల్లిఖార్జున ఖర్గే ఎక్స్ వేదికగా వెల్లడించారు.



