Thursday, July 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాణ్యతలో రాజీ వద్దు.. నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

నాణ్యతలో రాజీ వద్దు.. నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

- Advertisement -

రాయిచేడులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్
నవతెలంగాణ – ఉప్పునుంతల

నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం రాయిచేడు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రతిష్ఠాత్మక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, సాంకేతిక ప్రమాణాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రతి వారం స్పష్టమైన పురోగతి కనిపించేలా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వం ఆమోదించిన డిజైన్‌, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగానే నిర్మాణం కొనసాగాలని, ఎలాంటి మార్పులు చేయకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న బేస్‌మెంట్ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు అవసరమైన యంత్రాలు, నిర్మాణ సామగ్రి, కార్మికులను సమకూర్చి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.

నిర్మాణ నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని హెచ్చరించిన కలెక్టర్, సిమెంట్‌, స్టీల్‌, కాంక్రీట్‌ వంటి నిర్మాణ సామగ్రిని నిరంతరం పరీక్షిస్తూ ఇంజినీరింగ్ ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రతి దశ పూర్తయ్యాక నాణ్యతా తనిఖీలు నిర్వహించి, ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

అచ్చంపేట నియోజకవర్గ విద్యార్థులకు ఆధునిక తరగతి గదులు, వసతి గృహాలు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు, డైనింగ్ హాల్ వంటి అన్ని సౌకర్యాలతో కూడిన విద్యా వాతావరణాన్ని కల్పించడమే ఈ పాఠశాల నిర్మాణం లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని, అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనంతరం రాయిచేడు గ్రామంలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ పురోగతి, ప్రభుత్వం అందిస్తున్న సహాయం, ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సక్రమంగా వినియోగించి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఈ పర్యటనలో ఈడబ్ల్యూఐడీసీ ఈఈ, అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, ఇంజినీరింగ్ అధికారులు, గ్రామ సర్పంచ్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -