Friday, July 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చిరకాలంగా నిరీక్షిస్తున్న ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారిక పత్రాలతో పాటు, NEHS వెబ్ పోర్టల్, డిజిటల్ హెల్త్ కార్డులను వారు ఆవిష్కరించారు.

ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4.39 లక్షల మంది ఉద్యోగులు, 3.62 లక్షల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 17.88 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. వీరికి 114 ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు అపోలో, యశోద, కిమ్స్, కేర్, స్టార్ వంటి 886 ప్రముఖ కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదురహిత (క్యాష్‌లెస్) వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) ధరలకు అనుగుణంగా 1,816 రకాల మెడికల్, సర్జికల్ ప్యాకేజీలను ఈ పథకంలో పొందుపరిచారు.

పథకం నిర్వహణ కోసం ఉద్యోగులు, పెన్షనర్లు తమ ప్రాథమిక వేతనం లేదా పెన్షన్‌లో 1.5 శాతం వాటాను విరాళంగా అందజేస్తారు. అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా తన వంతుగా జమ చేస్తుంది. నిధుల నిర్వహణలో పూర్తి పారదర్శకతను పాటిస్తూ ప్రభుత్వ, ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో కూడిన ఒక ప్రత్యేక ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ) ఏర్పాటు చేశారు. లబ్ధిదారులు NEHS పోర్టల్ ద్వారా తమ డిజిటల్ హెల్త్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -