నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ చర్యలను ఖండిస్తూ ప్రతిపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పోలీసుల చర్యను ఖండిస్తూ సీనియర్ సీపీఐ(ఎం) నాయకురాలు బృందాకారత్ జంతర్ మంతర్‌ను సందర్శించారు. కొనసాగుతున్న విద్యార్థి-యువజన ఉద్యమానికి, నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులకు, యువతకు బృందాకారత్ సంఘీభావం తెలిపారు.
జంతర్ మంతర్ వద్ద వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహాం వ్యక్తం చేశారు “అహంకారంతో” వ్యవహరించవద్దని, ఈ తరహా ప్రవర్తనకు “చరిత్రే సాక్షి” అని ఎక్స్ వేదికగా కేజ్రీవాల్ పేర్కొన్నారు.
వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌పై మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యపై పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చర్చలకు దిగకుండా శాంతియుత నిరసనలను అణచివేస్తోందని ఆమె ఆరోపించారు. “సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం, క్షేమం గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నాను. ఆయన కేవలం చర్చలు మాత్రమే కోరారు, అయినా ఆయన విజ్ఞప్తిపై వారాలుగా మౌనమే సమాధానంగా నిలిచింది. ప్రజాస్వామ్యంలో, శాంతియుత నిరసనలకు చర్చలు జరపాలి కానీ మౌనం కాదు” అని అన్నారు. వాంగ్‌చుక్ గొంతుతో పాటు పలువురు యువ భారతీయుల గొంతులను కూడా విస్మరించారని, లెక్కలేనంత మంది యువ భారతీయుల గొంతులను ఎలాగైతే విస్మరిస్తున్నారో, అలాగే ఆయన గొంతును కూడా విస్మరించారు” అని ఆమె ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.



