నవతెలంగాణ – హైదరాబాద్ : క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. వెస్టిండీస్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఆల్ రౌండర్‌గా పేరుగాంచిన సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ (89) బార్బడోస్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ సహా పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ఆయనకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.
సర్ గ్యారీ సోబర్స్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సచిన్ టెండూల్కర్ ‘ఎక్స్’లో భావోద్వేగభరిత పోస్ట్ చేశాడు. “సర్ గ్యారీ ఇక లేరనే వార్తను జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఆయనతో గడిపిన ఎన్నో మధుర జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. 2003 ప్రపంచకప్‌లో నా చేతికి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ ట్రోఫీని అందించింది ఆయనే. నేను 100వ అంతర్జాతీయ శతకం పూర్తి చేసినప్పుడు నన్ను అభినందించిన తీరు మరువలేనిది. ఆయనెప్పుడూ ఎంతో సౌమ్యంగా ఉండేవారు. కొన్నేళ్ల క్రితం లండన్‌లో మేమిద్దరం కలిసి ఆట గురించి మాట్లాడుకున్నాం. అదే మా చివరి సమావేశం అవుతుందని ఊహించలేకపోయాను. ఆయనే అసలైన ‘వన్ అండ్ ఓన్లీ’. మిమ్మల్ని చాలా మిస్ అవుతాం సర్ గ్యారీ. మీ ఆత్మకు శాంతి చేకూరాలి” అని సచిన్ రాసుకొచ్చాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా సోబర్స్‌కు నివాళులర్పించాడు. “క్రికెట్ ప్రపంచం తన గొప్ప వ్యక్తులలో ఒకరిని కోల్పోయింది. సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ఆత్మకు శాంతి కలుగుగాక. మీ వారసత్వం రాబోయే తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది” అని కోహ్లీ పేర్కొన్నాడు. భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం సోబర్స్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.



