నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నాయకులు పేర్కొన్నారు. ఈ విషయమై శనివారం డీసీసీ అధ్యక్షుడు డా.నరేష్ జాధవ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) సాకుతో ఈ చట్టాన్ని నిరవధికంగా వాయిదా వేయడం తీవ్రంగా ఖండించదగిన విషయమని డీసీసీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మొదటి నుండి మహిళా రిజర్వేషన్లకు పూర్తి సానుకూలంగా ఉన్నారన్నారు.
పార్లమెంట్‌లోనూ, బయట మహిళలకు చట్టసభల్లో తక్షణమే 33 శాతం కోటా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మహిళల రాజకీయ సాధికారతకు కట్టుబడి ఉంటుందని దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం లేదన్నారు. మహిళల భాగస్వామ్యం పెరగాలంటే ఈ చట్టాన్ని వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు .ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల అమలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించి, తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి మంజుల, నాయకులు ఏ.పుచ్చక్క, పి.రాధ, గంగాసాగర్, అరిఫా బేగం పాల్గొన్నారు.



