ప్రిలిమినరి నోటిఫికేషన్ ప్రకారం ప్రతి ఇంటిని సర్వే చెయాలి
నవతెలంగాణ – మల్హర్ రావు
డేంజర్ జోన్లో జరుగుతున్న భూసేకరణ ప్రక్రియ సర్వే బృందాన్నీ భూ నిర్వాసితుల సంఘం ఆర్గనైజేషన్ సెక్రటరీ తాండ్ర మల్లేష్, ఎల్లయ్య, రాజపోచం, సమ్మయ్య తోపాటు పలువురు శనివారం ఎస్సికాలనిలో అడ్డుకున్నారు. డేంజర్ జోన్లో ఉన్న ప్రతి ఇంటిని సర్వే చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సర్వే పనులు కొనసాగనివ్వమని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడారు. తాడిచెర్లలోని కాపురం ఓసిపి బ్లాక్-1కు 500 మీటర్ల డేంజర్ జోన్లో టిఎస్ జెన్కో అధికారులు ఇండ్లకు వేసిన నెంబర్ల ప్రకారం.. అలాగే 17-12- 2022 ప్రిలిమినరి నోటిఫికేషన్ (పిఎన్) ప్రకారం ప్రతి ఇంటిని సర్వే చేయాలన్నారు. జీపీ రికార్డుల్లో ఉన్న ఇండ్లనే సర్వే చేయాలని తమకు రెవెన్యూ, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని సర్వే బృందాలు చెప్పడం సరికాదన్నారు. జీపీ రికార్డుల్లో లేకున్నా, టిఎస్ జెన్కోనెంబర్లు వేసిన ప్రతి ఇంటిని సర్వే చేయాలని లేదంటే సర్వే జరగనివ్వమన్నారు.
ఆందోళన చెందొద్దు ఇండ్లన్నీ సర్వే చేస్తాం: తహశీల్దార్ రవికుమార
డేంజర్ జోన్లో ఉన్న భూ నిర్వాసితులు ఎవరు ఆందోళన చెంద్దొద్దు ఇండ్లన్నీ సర్వే చేస్తామని మండల తహశీల్దార్ రవికుమార్ చెప్పారు. డేంజర్ జోన్లో ఉన్న 2,260 ఇండ్లను కలెక్టర్, ఆర్డీఓ ఆదేశాల మేరకు ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నారు. ఇవే కాకుండా తప్పిన ప్రతి ఇంటిని ఉన్నతాధికారుల ఆదేశాలతో సేకరిస్తున్నారు.



