టీఎన్జీవో జడ్చర్ల తాలూకా అధ్యక్షులు తిరుపతి
నవతెలంగాణ-మిడ్జిల్
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పని చేస్తున్న వారికి హెల్త్ కార్డుల అమలుపై సర్కార్ స్పష్టమైన నిర్ణయం వెల్లడించడం హర్షణీయమని టీఎన్జీవో జడ్చర్ల తాలూకా అధ్యక్షులు కావలి తిరుపతయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం నవతెలంగాణతో మాట్లాడుతూ.. హెల్త్ కార్డులతో చికిత్స పొందుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై రేవంత్ రెడ్డి సర్కార్ సానుకూలంగా స్పందించడం, హెల్త్ కార్డుల వినియోగంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించడం అభినందనీయమన్నారు.
రాష్ట్రంలోని అధీకృత (ఎంపైనల్‌డ్) ఆస్పత్రులు హెల్త్ కార్డులను తప్పనిసరిగా అంగీకరించి వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతోపాటు హెల్త్ కార్డులను అంగీకరించకుండా చికిత్సను నిరాకరించే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం, ఎలాంటి ఆటంకాలు లేకుండా హెల్త్ కార్డు సేవలను వినియోగించుకునేలా తీసుకున్న నిర్ణయాలు లబ్దిదారులకు ఎంతో ఊరటనిస్తుందన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డికి, టీఎన్జీవో జడ్చర్ల తాలుకా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలను ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



