ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలకు పెంచాలి
తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి దుబాసి పార్వతి
నవతెలంగాణ – మల్హర్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిబంధనలు లబ్ధిదారులకు తీరని కష్టాలను తెచ్చిపెడుతున్నాయని, తక్షణమే ఈ నిబంధనలను సవరించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి దుబాసి పార్వతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో మాట్లాడారు ప్రభుత్వం విధించిన పరిమితులు, కేటాయించిన అరకొర ఆర్థిక సహాయం పేద వర్గాలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రుల బాత్రూంల రిపేర్లకే లక్షలు, పేదవాడి ఇంటికి ఐదు లక్షలేనా.? అన్నారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రుల ఇళ్లలో కేవలం చిన్న చిన్న రిపేర్లు చేయించడానికే రూ. 15 నుండి రూ.20 లక్షల ప్రజాధనం ఖర్చవుతోందని విమర్శించారు.
నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, బిసిలు జీవితాంతం తలదాచుకునే పూర్తిస్థాయి ఇల్లు నిర్మించుకోవడానికి మాత్రం కేవలం రూ. 5 లక్షలు కేటాయించడం ఏమాత్రం న్యాయం కాదన్నారు. పెరిగిన సిమెంట్, ఐరన్, కూలీల ఖర్చుల దృష్ట్యా ఇందిరమ్మ ఇంటికి రూ.10 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 400 నుండి 1000 చదరపు అడుగులకు పెంచాలి. ఇల్లు 400 నుండి 600 చదరపు అడుగుల లోపే ఉండాలనే నిబంధన పేదల భవిష్యత్తు అవసరాలను దెబ్బతీస్తోందన్నారు. ఒక కుటుంబం నివసించడానికి ఈ విస్తీర్ణం ఏమాత్రం సరిపోదని, ఈ పరిమితిని 400 నుండి కనీసం 1000 చదరపు అడుగుల వరకు పెంచాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం చాలక, నిబంధనల సాకుతో బిల్లులు నిలిపివేయడంతో పేదలు బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని రూ.10 లక్షలకు పెంచి, స్థల పరిమితి నిబంధనలను సవరించాలని, లేని పక్షంలో లబ్ధిదారుల తరఫున పెద్ద ఎత్తున రాష్ట్రమంతా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి అయిత బాపు.తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు బూడిది లావణ్య.నాయకులు మంథని మల్లేష్.శంకర్. పాల్గొన్నారు.



