Saturday, August 8, 2026
E-PAPER
Homeఆటలుచెమటోడ్చిన పేసర్లు

చెమటోడ్చిన పేసర్లు

- Advertisement -

శ్రీలంక ఎలెవన్‌ 363/8
కుల్‌దీప్‌, జడేజా మాయాజాలం
3 రోజుల వార్మప్‌ మ్యాచ్‌ తొలి రోజు

కొలంబో (శ్రీలంక)
శ్రీలంక గడ్డపై నాణ్యమైన స్పిన్‌ను ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లకు చక్కటి ప్రాక్టీస్‌ లభిస్తుందనుకున్న మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ తొలి రోజు మన పేసర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక ఎలెవన్‌ పరుగుల వేటలో మెప్పించింది. ఏడుగురు బ్యాటర్లు 30 ప్లస్‌ పరుగులు చేయగా, ముగ్గురు బ్యాటర్లు అర్థ సెంచరీలు సాధించారు. దీంతో వికెట్ల వేటలో భారత బౌలర్లకు చుక్కెదురైంది. ఆఖర్లో స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, మానవ్‌ సుతార్‌ వికెట్లు పడగొట్టడంతో తొల రోజు ఆటలో భారత్‌కు కాస్త ఊరట దక్కింది. శ్రీలంక ఎలెవెన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 8 వికెట్లకు 363 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌ (2/76), రవీంద్ర జడేజా (2/64), మానవ్‌ సుతార్ (2/33) రెండేసి వికెట్లు పడగొట్టారు. పేసర్లలో గుర్నూర్‌ బరార్‌ (1/49) ఒక్కడే వికెట్‌ తీయగలిగాడు.

పేసర్లు కష్టపడినా.. !
టాస్‌ నెగ్గిన శ్రీలంక ఎలెవన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు అర్థ సెంచరీలతో ఆతిథ్య జట్టుకు మంచి ఆరంభం అందించారు. నిశాన్‌ ఫెర్నాండో (66, 65 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌), రవిందు రసంత (71, 143 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 20.4 ఓవర్లలో 110 పరుగులు జోడించారు. పేసర్లు వికెట్‌ పడగొట్టడంలో విఫలమవగా.. మెరుపు ఫీల్డింగ్‌తో భారత్‌ వికెట్ల ఖాతా తెరిచింది. మానవ్‌ సుతార్‌, రాహుల్‌లు ఫెర్నాండోను రనౌట్‌ చేయటంతో సెంచరీ భాగస్వామ్యానికి తెరపడింది. రసంతకు తోడుగా నిలిచిన పసిందు సూరియభద్ర (35, 63 బంతుల్లో 6 ఫోర్లు)ను జడేజా సాగనంపటంతో ఆతిథ్య జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. పవన్‌ రత్ననాయకె (39, 47 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), అహాన్‌ విక్రమసింఘె (31, 43 బంతుల్లో 4 ఫోర్లు), సోనల్‌ దినుశ (52, 72 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), రమేశ్‌ మెండిస్‌ (32, 49 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. బ్యాటింగ్‌ లైనప్‌లో అందరూ సమిష్టిగా మెరవటంతో శ్రీలంక ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు ఖాయం చేసుకుంది. కుల్‌దీప్‌ యాదవ్‌, మానవ్‌ సుతార్‌లు ఆఖర్లో వికెట్ల వేట మొదలెట్టగా.. తొలి రోజు శ్రీలంక ఎలెవెన్‌ 8 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, సరాంశు జైన్‌లకు వికెట్లు దక్కలేదు.

గిల్‌కు గాయం
భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ గాయానికి గురయ్యాడు. వార్మప్‌ మ్యాచ్‌ ముంగిట ప్రాక్టీస్‌ సెషన్లో శుభ్‌మన్‌ గిల్‌ కుడి చేతి రింగ్‌ ఫింగర్‌కు గాయమైంది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా వార్మప్‌ మ్యాచ్‌ తొలి రోజు శుభ్‌మన్‌ గిల్‌ మైదానంలో అడుగుపెట్టలేదు. గాయం తీవ్రత తక్కువే అయినా.. శుభ్‌మన్‌ గిల్‌ నేడు బ్యాటింగ్‌కు వస్తాడా? లేదా? అనేది తేలాల్సి ఉంది. మరో టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన కాలి బొటనవేలి గాయంతో బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టు గాలెలో 15 నుంచి ఆరంభం కానుండగా.. 13న అతడు శ్రీలంకకు చేరుకునే వీలుందని సమాచారం. ఇప్పటికే నితీశ్‌కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, హర్షిత్‌ రానాలు గాయాలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -