– మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిద్దాం
– సీఐటీయూ ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
కార్మిక చట్టాలను పూర్తిగా మార్చి లేబర్ కోడ్లను అమలు చేసి కార్మికుల హక్కులను హరిస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న నిర్వహించే జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులు, కష్టజీవుల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా “క్విట్ ఇండియా” ఉద్యమం నిర్వహించి దేశాన్ని విముక్తి చేసుకున్న చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని, నేడు బహుళజాతి కంపెనీలు, బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జైలు భరో కార్యక్రమంలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.
మున్సిపల్ కార్మికులకు కనీస వేతనంగా రూ.42 వేలును అమలు చేయాలని, 1972 గ్రాట్యుటీ చట్టం ప్రకారం పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించాలని, చివరి నెల వేతనం ఆధారంగా చట్టబద్ధంగా గ్రాట్యుటీని లెక్కించి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ మండల కన్వీనర్ కేసుపాక నరసింహారావు, నందు దుర్గమ్మతో పాటు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.



