– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ రూ.5 లక్షల నిధులను కేటాయించారు. ఈ నిధులతో కళాశాలలో సభావేదిక (స్టేజ్) నిర్మాణం, స్టడీ అవర్స్‌కు అవసరమైన సదుపాయాలు, ఫ్లోరింగ్ పనులు, ఆర్వో ప్లాంట్ మరమ్మతులు తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.ఈ పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవసరమైన అన్ని మౌలిక వసతులను దశలవారీగా కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావంతో చదువుకుని ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కళాశాల ప్రాంగణంలో వాకింగ్ ట్రాక్‌తో పాటు జిమ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యతో పాటు శారీరక దారుఢ్యం, క్రీడా సామర్థ్యాల పెంపుకు అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, తహశీల్దార్ దాసరి కిశోర్, కళాశాల ప్రిన్సిపాల్ అల్లు అనిత, వార్డు కౌన్సిలర్ నార్లపాటి మహేష్, అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.



