– సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్
నవతెలంగాణ-సత్తుపల్లి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే కార్యక్రమంలో ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ స్పష్టం చేశారు. సత్తుపల్లి మండలం బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని నారాయణపురం గ్రామంలో భూముల రీసర్వేపై సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ శనివారం గ్రామ సభను నిర్వహించారు. రీ-సర్వే ప్రాముఖ్యత, దాని వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలను ప్రజలకు వివరించారు. ఈ సర్వే ద్వారా రైతులకు, భూ యజమానులకు చేకూరే ప్రయోజనాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. దీర్ఘకాలికంగా ఉన్న భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమన్నారు.
ప్రతి ఒక్కరికీ స్పష్టమైన, వివాదాల్లేని భూ హక్కులను అందించడానికి రీ-సర్వే ఉపయోగపడుతుందని చెప్పారు. ఆధునిక సాంకేతికతతో జరిగే ఈ సర్వేతో భూ రికార్డుల్లో పారదర్శకత స్పష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామస్థులంతా క్షేత్రస్థాయికి వచ్చే సర్వే బృందాలకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. రైతులు తమ భూములకు సంబంధించిన సరిహద్దులను స్పష్టంగా చూపించాలని సూచించారు. సర్వే సమయంలోనే తమ భూముల రికార్డులను సరిచేసుకోవడానికి మంచి అవకాశం లభిస్తుందన్నారు.
రికార్డులు పక్కాగా ఉంటే భవిష్యత్తులో ఎలాంటి భూ తగాదాలు రావని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, రుణాలు పొందడానికి కూడా ఈ స్పష్టమైన రికార్డులు ఎంతో అవసరమన్నారు. ఈ సభలో ప్రజల నుంచి వచ్చిన పలు సందేహాలను సబ్ కలెక్టర్ స్వయంగా నివృత్తి చేశారు. సర్వే ప్రక్రియ వేగంగా, సజావుగా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక రెవెన్యూ అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.



