– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కాకర్లపల్లిలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-సత్తుపల్లి : నీట్ పరీక్షా పత్రాల లీకేజీపై, సామాజికవేత్త వాంగ్ చుక్ ను పోలీసులు అరెస్టు చేయడానికి నిరసిస్తూ విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు విచక్షణా రహిత లాఠీచార్జి, బాష్పవాయువును ప్రయోగించడాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు మాట్లాడుతూ… విద్యార్థులపై పోలీసులు జరిపిన అమానుష దాడి ప్రజాస్వామ్య విరుద్ధమని తీవ్రంగా ఖండించారు.
నిరసనకారులపై లాఠీఛార్జికి ఆదేశించిన పోలీసు అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 23 రోజులుగా సోనమ్ వాంగ్ చుక్ ఢిల్లీలో నిరసన దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా, విద్యార్థుల గొంతు నొక్కాలని చూడటం విచారకరమన్నారు.
మోదీ ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల డిమాండ్లను అంగీకరించాలని, అరెస్టయిన వారందరిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని వెంటనే రద్దు చేయాలన్నారు.
నీట్ పరీక్షల పేపర్ లీకేజీ కారణంగా అనేకమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది మానసిక క్షోభకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ నాయకులు వేపులపాటి కుమారస్వామి, కువ్వారపు లక్ష్మణరావు, కావూరి వెంకటేశ్వరరావు, బెజవాడ లక్ష్మీనారాయణ, తడికమళ్ల రామకృష్ణ, దాట్ల రాంబాబు, వేపులపాటి పుష్పావతి, శైలజ, షేక్ యాకూబ్ పాల్గొన్నారు.


