Wednesday, July 22, 2026
E-PAPER
Homeజాతీయం152 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: రాహుల్‌ గాంధీ

152 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: రాహుల్‌ గాంధీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: గత దశాబ్దకాలంలో 152 ప్రశ్నాపత్రాల లీకయ్యాయని, దీంతో 7.5 కోట్ల మంది (750 లక్ష‍లమంది) విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని లోక్‌సభ ప్రతిపక్ష‍ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. సీజేపీ ర్యాలీపై పోలీసుల చర్యలను ఖండించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల డిమాండ్లకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానాల్లో ఒకటిగా నిలిచిన మనదేశ విద్యావ్యవస్థ నేడు ఒక అక్రమ వ్యవస్థగా మారిందన్న విషయం అందరికీ స్పష్టంగా తెలుసని అన్నారు. దశాబ్దకాలంలో 152 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని, లెక్కవేసి చూస్తే నెలకు ఒక పేపర్‌ లీకైనట్లని అన్నారు. ‘‘ప్రతి నెలా లక్ష‍లాది మంది విద్యార్థులతో మీరు గతంలో ఎదుర్కొన్న ఒత్తిడినంతా మళ్లీ ఎదుర్కోవాల్సిందేనని చెబుతారు. ఆ తర్వాత దానితో మాకు ఏమాత్రం సంబంధం లేదని దాటవేస్తారు’’ అని అన్నారు.


7.5కోట్లమంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యారని, వారిలో చాలామంది మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందినవారని అన్నారు. తమ కష్టార్జితాన్నంతా ఈ పరీక్ష‍ల కోసం వెచ్చిస్తారని, కానీ వారి శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ నిందితులకు మాత్రం శిక్ష‍లు పడలేదని మండిపడ్డారు. విద్యార్థులు న్యాయమైన విద్యావిధానం కోరుకోవడం తప్పా అని ప్రశ్నించారు. విద్యార్థులకు ఎందుకు ఇలా జరుగుతోంది. వారిపై ఆయుధాలను గురిపెట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, వారు చేసిన తప్పేంటి అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతూ, తమ డిమాండ్లను వినిపిస్తున్నారని అన్నారు.

దేశం తమకు కల్పించాల్సిన హక్కుల గురించి అడుగుతున్నారు. ఈ దేశ విద్యార్థులుగా మాకు న్యాయమైన విద్యా విధానం కావాలని మాత్రమే కోరుతున్నారని అన్నారు. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ప్రశ్నాపత్రాల లీకేజీలతో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. విద్య కోసం కేంద్రప్రభుత్వం 1.4లక్ష‍ల కోట్లు కేటాయిస్తుండగా.. ప్రతి ఏడాది నీట్‌ పరీక్ష‍ కోసం విద్యార్థులు 1.32లక్ష‍ల కోట్లు ఖర్చు పెడుతున్నారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -