నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
ఢిల్లీ జంతర్‌మంతర్‌లో విద్యార్థులు, ఉద్యమకారులపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్బంధ చర్యలను ఖండిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం విశ్వవిద్యాలయాల విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భారీ నిరసన ర్యాలీ, కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో విద్యార్థులు ప్రసంగించారు.
ఈ సభలో విద్యార్థి నాయకులు రవితేజ, నళిగంటి శరత్, డా. ఎస్. నాగేశ్వరరావు, ఆజాద్, స్వాతి, శరత్, ఉదయ్,ఆర్.ఎల్. మూర్తి, సునీల్ నేరేడు, దర్శన్, సుమంత్, నవీన్, నాగరాజు, శ్రీధర్, చిరంజీవి, సతీష్ పాల్గొని ప్రసంగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం విద్యార్థి ఉద్యమకారులపై అమానవీయంగా, అణచివేత చర్యలు చేపట్టడం దేశ ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే చర్య అని తీవ్రంగా విమర్శించారు.
దేశ యువతకు బాధ్యత వహించాల్సిన పాలకులు కార్పొరేట్ ప్రయోజనాల కోసం విద్యార్థులపై లాఠీచార్జీలు, వాటర్ కానన్లు, టియర్ గ్యాస్ వంటి నిర్బంధ పద్ధతులను వినియోగించడం అత్యంత అన్యాయం మరియు అమానుషమని పేర్కొన్నారు. 2024లో జరిగిన నీట్ – యూజీ మరియు యూజీసీ-నీట్ పరీక్షల పేపర్ లీకేజీలు బహిరంగ రహస్యమని, అప్పట్లో ప్రధాని స్పందించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానిపై చర్యలు తీసుకుని ఉంటే ప్రస్తుత పరిస్థితులు ఏర్పడేవి కాదని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని,పరీక్షల నిర్వహణ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరారు.
రాష్ట్రాలకు స్వతంత్రంగా పరీక్షలు నిర్వహించే అధికారాన్ని కల్పించాలని, ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమానికి మహిళా జేఏసీ, ట్రాన్స్‌జెండర్ సంఘాలు, వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, మేధావులు, ప్రొఫెసర్లు సంఘీభావం ప్రకటించారు.ఈ నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.



