గత పన్నెండేండ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని ‘‘నూతన భారత్’’గా తీర్చిదిద్దుతున్నామని ప్రకటిస్తోంది. జనధన్ ఖాతాలు, ఆధార్, యూపీఐ, డిజిటల్ చెల్లింపులు, జీఎస్టీ, మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలు, భారీ మౌలిక సదుపాయాల నిర్మాణం, రక్షణ రంగ స్వదేశీకరణ – ఇవన్నీ ప్రభుత్వ ఆర్థిక సంస్కరణల విజయాలుగా ప్రస్తావించబడుతున్నాయి. ఈ ప్రచార వెలుగుల వెనుక దాగి ఉన్న ఒక అసౌకర్యకరమైన ప్రశ్నను కూడా దేశం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వ పుష్కర ఆర్థిక పాలనపై సమతుల్యమైన అంచనా అవసరం. డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణంలో ప్రభుత్వం విశేష పురోగతి సాధించింది. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, డిజిటల్ సేవల విస్తరణలో గణనీయమైన అభివృద్ధి కనిపిస్తోంది. కొన్ని తయారీ రంగాల్లో పెట్టుబడులు కూడా పెరిగాయి. అయితే చిన్న పరిశ్రమల బలోపేతం, దేశీయ విలువ జోడింపు, ఉపాధి ఆధారిత పారిశ్రామికీకరణ, చైనా దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించడం వంటి లక్ష్యాలు ఇంకా పూర్తిగా సాధించబడలేదు. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత్, దేవుడి విగ్రహాల నుంచి మొబైల్ ఫోన్ భాగాలు, ప్లాస్టిక్ పూల వరకు, ఫార్మా రంగానికి అవసరమైన ఎపిఐల నుంచి సోలార్ పరికరాల వరకు ఎందుకు ఇంకా చైనా దిగుమతుల పైనే ఆధారపడుతోంది? ఇది భారత్ స్వయం సమృద్ధిగా పరిగణించలేం కదా.
మాట మాట్లాడితే అమెరికా సంకనెక్కే మోడీ నాయకత్వం చైనాలాగా ఎందుకు ఆలోచించడం లేదు? ఈ రోజు అన్ని రంగాల్లో సవాళ్లను అధిగమిస్తూ సాంకేతికంగా కూడా ప్రపంచంలో అగ్రశేణిగా చైనా సాగుతోంది. భారత జనాభా చైనాను అధిగమించింది అని చెప్పుకోవడం కాదు, ఏం సాధించదిన్నదే ముఖ్యం. 2025–26లో చైనా నుంచి భారత దిగుమతులు సుమారు 132 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. గతంలో కూడా ఈ సంఖ్య 100 బిలియన్ డాలర్లను దాటింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సుమారు 51 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులకు దేశీయ ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇది ఒక కీలకమైన విషయాన్ని స్పష్టం చేస్తోంది – పన్నెండేండ్ల ‘‘మేక్ ఇన్ ఇండియా’’ ప్రయాణం తర్వాత కూడా అనేక వ్యూహాత్మక ఉత్పత్తుల్లో దేశం స్వయం సమృద్ధిని సాధించలేకపోయింది. ఇక్కడే భారత ఆర్థిక నమూనాలోని ప్రధాన విరుద్ధాభాసం బయటపడుతుంది. దేశం డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణంలో విశేష విజయాన్ని సాధించింది. యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపు వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగింది.
‘జనధన్’తో బ్యాంకులకే లాభం
జనధన్ ద్వారా కోట్లాది మంది బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చారు. ఇవన్నీ వ్యవస్థాపరమైన సంస్కరణలే. కానీ ఇవి స్వయంగా ఉత్పత్తి, ఉపాధి, ఆదాయ వృద్ధికి హామీ ఇవ్వవు. ఒక కార్మికుడు యూపీఐ ద్వారా వేతనం పొందడం వల్ల అతని ఆదాయం పెరగదు. ఒక కుటుంబం జనధన్ ఖాతా తెరవడం వల్ల ఆ కుటుంబ ఆర్థిక స్థితి మారదు. డిజిటల్ వ్యవస్థలు లావాదేవీలను సులభతరం చేస్తాయి, కానీ కొత్త పరిశ్రమలను నిర్మించవు. అవి ఉపాధిని సృష్టించే సాధనాలు కావు. ఈ ప్రాథమిక తేడా ప్రభుత్వ ప్రచారంలో చాలాసార్లు కనిపించకుండా పోతోంది. జనధన్ పథకాన్ని కూడా ఇదే కోణంలో చూడాలి. కోట్లాది మంది బ్యాంకింగ్ వ్యవస్థలోకి రావడం వల్ల బ్యాంకులకు భారీ స్థాయిలో తక్కువ వ్యయంతో డిపాజిట్లు లభించాయి. కానీ అదే ప్రజలకు చౌకైన రుణాలు, చిన్న వ్యాపారాలకు మూలధనం, ఉత్పాదక పెట్టుబడులు, స్థిరమైన బీమా, పెన్షన్ వంటి ఆర్థిక అవకాశాలు అదే స్థాయిలో అందాయా అనే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది.
ద్వంద విధానాన్ని పోషిస్తున్న జీఎస్టీ
జీఎస్టీ కూడా ఇలాంటి ద్వంద్వాన్ని ప్రతిబింబిస్తోంది. దేశాన్ని ఒకే మార్కెట్‌గా మార్చాలన్న ఆలోచన సూత్రప్రాయంగా సరైనదే. పెద్ద కంపెనీలు ఏకీకృత పన్ను వ్యవస్థ వల్ల ప్రయోజనం పొందాయి. కానీ చిన్న వ్యాపారాలకు కంప్లయెన్స్ భారం, రిటర్నుల దాఖలు, అకౌంటింగ్ ఖర్చులు, వర్కింగ్ క్యాపిటల్ ఒత్తిడి గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా కోవిడ్ అనంతరం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మరింత బలమైన పునరుద్ధరణ విధానాలు అవసరమయ్యాయి. అయితే విధానపరంగా పెద్ద పెట్టుబడులు, భారీ పరిశ్రమలు, కార్పొరేట్ విస్తరణకు అధిక ప్రాధాన్యం లభించగా, చిన్న తయారీదారుల బలోపేతం తగినంత వేగంతో ముందుకు సాగలేదన్న విమర్శను కొట్టిపారే యలేం. భారత్‌లో అసెంబుల్ అవుతున్న మొబైల్ ఫోన్లో చిప్, డిస్ప్లే, కెమెరా మాడ్యూల్, బ్యాటరీ, అధునాతన ఎలక్ట్రానిక్ భాగాలు ఎక్కువగా విదేశాల నుంచే వస్తే, అది పూర్తి స్థాయి భారతీయ తయారీగా పరిగణించలేం. ‘‘Made in India’’ అనే లేబుల్ ఉండొచ్చు. కానీ ‘‘Made mostly by India’’ అనే స్థాయికి ఇంకా చేరుకోలేదు. తయారీ సామర్థ్యాన్ని కొలవాల్సింది తుది అసెంబ్లీతో కాదు, దేశీయ విలువ జోడింపు శాతంతో అన్నది గుర్తించాలి.
దిగుమతుల ఊబిలో ఫార్మా
ఫార్మా రంగం ఈ పరిస్థితికి అత్యంత స్పష్టమైన ఉదాహరణ. ప్రపంచానికి చౌకైన జనరిక్ ఔషధాలను సరఫరా చేస్తున్న భారత్, వాటి తయారీకి అవసరమైన అనేక కీలక ఎపిఐలు, బల్క్ డ్రగ్స్, ఇతర విషయాల్లో ఇప్పటికీ చైనాపైనే ఆధారపడు తోంది. ఇది కేవలం వాణిజ్య అంశం మాత్రమే కాదు, జాతీయ ఆరోగ్య భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక అంశం కూడా. తుది ఉత్పత్తిని తయారు చేయగలిగినా, ముడి రసాయన గొలుసు విదేశాలపై ఆధారపడితే నిజమైన స్వావలంబన సాధించామని చెప్పడం కష్టం. చిన్న ఉత్పత్తులు కూడా చైనా నుంచి దిగుమతి కావడం మన సామర్థ్యాన్ని కూడా ప్రశ్నిస్తోంది. చైనా ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం తప్పుకాదు, కానీ ఆ దేశంలాగా ఎందుకు ఆలోచించడం లేదన్నదే ప్రశ్న. భారతీయ కళాకారుడు, చిన్న తయారీదారుడు అధిక ఉత్పత్తి వ్యయం, సాంకేతికత కొరత, చౌక రుణాల లభ్యత లేక పోవడం, మార్కెటింగ్ బలహీనత వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాడు. మరోవైపు చైనా సమగ్ర సరఫరా గొలుసు, భారీ ఉత్పత్తి సామర్థ్యం, ఆధునిక యంత్రాలు, ఎగుమతి మౌలిక సదుపాయాల ద్వారా ప్రపంచ మార్కెట్లను నేడు శాసించేస్థాయికి ఎదిగింది. ‘‘వోకల్ ఫర్ లోకల్’’ అనే నినాదం ఒక్కటే సరిపోదు, స్థానిక తయారీదారుడిని ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేసే విధానాలు అవసరం.
‘ఆత్మనిర్భర్’ అంటే అసెంబుల్నా?
భారతదేశానికి భారీ పరిశ్రమలు అవసరమే. మౌలిక సదుపాయాలు, రక్షణ తయారీ, ఆధునిక పరిశ్రమలు కూడా అత్యవసరం. అయితే ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఇ రంగం పోషించే పాత్రను విస్మరించలేం. ఒక పెద్ద ఆటోమేటెడ్ పరిశ్రమ వేల కోట్ల పెట్టుబడితో పరిమిత ఉద్యోగాలు సృష్టించవచ్చు. అదే పెట్టుబడిని వేలాది చిన్న పరిశ్రమలకు సాంకేతి కత, యంత్రాలు, చౌక రుణాలు, మార్కెట్ అనుసంధానం రూపంలో అందిస్తే మరింత విస్తృత ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. అందుకే తయారీ విస్తరణతో పాటు ఉపాధి విస్తరణ కూడా సమానంగా జరిగే విధానాలు అవసరం.
ఇప్పటి వరకు భారత్ నిర్మించినది ప్రధానంగా ఒక డిజిటల్ వ్యవస్థ. ఇక నిర్మించాల్సింది సమగ్ర ఉత్పత్తి వ్యవస్థ. ‘‘ఆత్మనిర్భర్ భారత్’’ అంటే కేవలం దేశంలో ఒక ఉత్పత్తిని అసెంబుల్ చేయడం కాదు. ముడి పదార్థం నుంచి యంత్రాల తయారీ వరకు, పరిశోధన నుంచి తుది ఉత్పత్తి వరకు మొత్తం విలువ గొలుసును దేశంలోనే నిర్మించడం అవసరం. లేదంటే ప్రపంచంలో అగ్రశ్రేణి డిజిటల్ వేదికగా నిలిచినా, తయారీ రంగంలో విదేశీ సరఫరా గొలుసులపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థగానే మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది.
సిహెచ్.వి. ప్రభాకర్ రావు,
9391533339



