తెలంగాణను వేధిస్తున్న ప్రస్తుత కరువు కేవలం ప్రకృతి వైపరీత్యం ఫలితం కాదు. జలవనరుల ప్రణాళికలో జరిగిన తప్పిదాలు, వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వైఫల్యం, ప్రత్యామ్నా యంగా రాష్ట్రాన్ని శాశ్వత నీటి భద్రత కల్పించాల్సిన తుమ్మిడిహెట్టి నిర్మాణం లో జాప్యం-ఈ మూడు పరిణామాలు కలిసి తెలంగాణను తీవ్ర జల సం క్షోభంలోకి నెట్టాయి. ఒకవైపు జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్‌డిఎస్‌ఎ) హెచ్చరి కలతో కాళేశ్వరం బ్యారేజీలు వినియోగానికి అనర్హంగా మారగా, మరోవైపు ప్రాణహిత జలాలను విని యోగించే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు రెండున్న రేండ్లుగా ముందుకు సాగలేదు. ఫలితంగా నేడు రాష్ట్ర రైతాంగం, ప్రజానీకం కరువు భారాన్ని మోస్తున్నది. కాళేశ్వరం వైఫల్యానికి బీఆర్ఎస్, తుమ్మిడిహెట్టి నిర్మాణ జాప్యానికి కాంగ్రెస్‌లదే ముమ్మాటికీ బాధ్యత. ఇందులో అవకాశవాద రాజకీయాలకు తెరదీసిన బీజేపీ కూడా ఈ తతంగంలో దోషినే. కాళేశ్వరం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రారంభించిన నాలుగేళ్లలో ప్రతియేటా అన్నింటిలో పునాదుల అడుగున భారీ బొంగలు పడ్డాయి. సిమెంట్, కెమికల్, పాలి యూరతిన్ గ్రౌటింగ్ చేసినా మళ్లీ మళ్లీ పాతవి మూసినా కొత్త బొంగలు ఏర్పడ్డాయి. మేడిగడ్డలోని ఏడవ బ్లాక్ ఆరడుగులు భూమిలోకి కుంగిపోయింది.
ఎన్‌డిఎస్‌ఎ నివేదిక పేర్కొన్న పద్ధతికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రౌటింగ్ చేయడం వల్ల భూగర్భ, భూమి సాంకేతిక పరీక్షలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పునర్నిర్మాణం చేసే వరకు బ్యారేజీలలో చుక్కనీరు నిలుప కూడదని, గేట్లన్నీ తెరిచి ఉంచాలని నివేదిక చెప్పింది. మేడిగడ్డ ఏడవ బ్లాకు లోని పదకొండు పియర్స్ (పిల్లర్లు) అడుగుముట్టాకూల్చి నిర్మించాలని కూడా తేల్చి చెప్పింది. కూల్చి నిర్మించే క్రమంలో ఆరో బ్లాక్‌కు, ఎనిమిదో బ్లాకుకు ఏ మాత్రం నష్టం జరిగినా వాటిని కూడా కూల్చాల్సి వస్తుందని హెచ్చరించింది. మేడిగడ్డ ఏడవ బ్లాకు వలెనే, మూడు బ్యారేజీలలో ఏ బ్లాక్ అయినా ఎప్పుడైనా భూమిలో కుంగిపోవచ్చు లేదా కూలిపో వచ్చని పేర్కొంది. డిజైన్‌కు అనుగుణంగా నిర్మాణం, నిర్మాణానికి అనుగుణంగా ఆపరే షన్, అండ్ మెయిం టెనెన్స్‌ను నిర్వహిం చడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం వల్లే మూడు బ్యారేజీల పునాదుల్లో అత్యంత ప్రమాదకర విపత్తులు చోటు చేసుకున్నాయని అభిప్రాయ పడింది. ‘‘పునర్నిర్మాణం అంత ఆషామాషీ విషయం కాదు. అది ఎన్‌డిఎస్‌ఎ పరిధిలో కూడా లేదు. దేశంలోని ప్రముఖ వైజ్ఞానిక సంస్థలతో కలిసి లోతైన పునాది భూగర్భ పరీక్షలు, భూమి సాంకేతిక పరీక్షలు చేసి, ఆ నివేదికను కేంద్ర జల సంఘానికి అందజేసి, దాని వెలుగులో పునర్నిర్మాణం చేయాలి’’ అని పేర్కొంది. దీనివల్ల కాళేశ్వరం మూడు బ్యారేజీల భవిష్యత్తు, పునర్నిర్మాణం ఇప్పుడు అత్యంత ప్రశ్నార్థకంగా మారింది.
కరువు వేళ రాజకీయాలా?
ఈ నేపథ్యంలో వచ్చిన ‘ఎల్‌నినో’ తీవ్రమైన కరువు దుర్భిక్షం దేశంలో ముఖ్యంగా తెలంగాణలో తాండవం చేస్తోంది. వరి సాగు ప్రశ్నార్ధకంగా మారింది. మెట్ట పంటలకు వర్షపు నీరు లేదు. వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. ఎగువ మధ్య గోదావరిలో చుక్కనీరు లేదు. కృష్ణా నదిలోనూ నీటి జాడలు లేవు. కరువు రోజురోజుకూ విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కేవలం ప్రాణహిత నదిలో మాత్రమే నీరు ఉంది. అది కూడా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని వైన్ గంగా, వార్ధానది నుంచి ప్రాణహిత నదిలో వస్తున్న నీరు మాత్రమే. ఈ సత్యాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన ఇంజినీర్లు కూడా నేడు అంగీకరిస్తున్నారు. మేడిగడ్డ నుంచి నీరు ఎత్తిపోయాలనీ డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకత్వం కన్నెపల్లి పంపు హౌస్‌ను సందర్శించడంతో చర్చ తారాస్థాయికి చేరుకుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులైన హరీష్ రావు, కేటీఆర్‌లు వారి అను చరులు, కొందరు రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్నారు. అలా మూడు బ్యారేజీలు వినియోగిస్తే, ఎన్‌డిఎస్‌ఎ నివేదికల ప్రకారం బ్యారేజీల భవిష్యత్తుకే ముప్పు వచ్చే ఎలాంటి విపత్తులు అయినా సంభవిం చవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు భద్రాచలమూ, గ్రామాలు కొట్టుకుపోవడం అతిశయోక్తి మాత్రమే. వాస్తవం కాదు. మూడు బ్యారేజీలలో ఏ బ్లాకులైనా మేడిగడ్డ వలె కుంగిపోవడమో లేదా కూలిపోవడమో జరగవచ్చు. గేట్లు పూర్తిగా తెరిచి వచ్చిన నీరు వచ్చినట్టు దిగువకు విడవాలని, నీరు నిలువ చేయొద్దని ఎన్‌డిఎస్‌ఎ హెచ్చరించింది. అయితే ఆ హెచ్చరికను పక్కనపెట్టి, కరువును రాజకీయ అవకాశంగా మలచుకునే ప్రయత్నమే బీఆర్ఎస్ తాజా వైఖరిగా కనిపిస్తోంది.
కాళేశ్వరం అవినీతిపై చర్యలేవి?
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పినాకిని చంద్రఘోష్ ఏక సభ్య కమిషన్ తీర్పు ప్రకారం నిర్ధారించిన భారీ అవినీతికి కేసీఆర్, హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌లు, రజత్ కుమార్, స్మితాసబర్వాల్‌తో పాటు ముప్ఫయి మంది ఇంజనీర్లు అధికారులను నేడు జైల్లో పెట్టి విచారించాల్సిన అవసరం ఉన్నది.కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ నివేదికని ఈ రోజుకి తెలంగాణ ప్రజల ముందుంచ లేదు. బాధ్యులైన వారిపై కేసులు పెట్టి అరెస్టు చేసి శిక్షించలేదు. తెలంగాణ సంక్షోభానికి భారీ అవినీతికి కారణమైన వారిని రక్షించడం తప్ప మరొకటి కాదు. విచిత్రం ఏమిటంటే కాళేశ్వరంలో భారీ అవినీతి చేసి, మేడిగడ్డ ఏడవ బ్లాకు కుంగడానికి కారణమైన, మూడు బ్యారేజీల వైఫల్యానికి కారకులైన బీఆర్ఎస్ నాయకులే, నేడు విఫల కాళేశ్వరం నుండి నీరు ఎత్తిపోయాలనే చిత్రమైన డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్‌తో జతకట్టిన బీజేపీ ప్రభుత్వం మంత్రులు, అధికారులు తొమ్మిదేండ్లు కాళేశ్వరం ప్రాజెక్టును కీర్తించారు. ఎన్నికలకు ముందు బంధం చెడిపోగానే అమిత్ షాతో పాటు అందరూ ‘కాళేశ్వరం కేసీఆర్, బీఆర్ఎస్ ఏటీఎం’ అని విమర్శిస్తూ సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ రాజకీయ అధికార ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగబడే సిబిఐ, ఈడి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లు కాళేశ్వరం అవినీతిపై గాఢ నిద్రపోతున్నాయి. అప్పగించి ఏడాది దాటిన సీబీఐ ఉలుకు పలుకు లేదు. కాళేశ్వరం అవినీతి తిమింగలాలని సిబిఐ ఎందుకు శిక్షించదు? దోచుకున్న ధనాన్ని ఎందుకు జప్తు చేయదు?
తుమ్మిడిహెట్టి జాప్యం కాంగ్రెస్‌ది కాదా?
రీ-డిజైనింగ్, రీ-ఇంజనీరింగ్ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం భారీ అవినీతి కోసమే కాళేశ్వరం పేరిట మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీలకు శ్రీకారం చుట్టింది. 2016లో నిర్మాణం మొదలు పెట్టింది, 2019లో మూడు బ్యారేజీల నిర్మాణం పూర్తయింది. తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీ, ముగ్గురు ముఖ్యమంత్రులు సంయుక్తంగా మూడు బ్యారేజీలను ప్రారభించారు. కేవలం ఒకే ఒక్క తుమ్మిడిహెట్టి బ్యారేజీని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండున్నరేళ్లు గడిచినా తట్టమట్టి కూడా ఎందుకు ఎత్తలేదు? నిర్మాణాన్ని అడ్డుకున్నది ఎవరు? ముఖ్యమంత్రి నియోజక వర్గంలోని, నీరే లేని కొడంగల్ ఎత్తిపోతలకు ఉన్న ప్రాధాన్యత, కాంగ్రెస్ పార్టీనీ గెలిపించిన తుమ్మిడిహెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతలో లేదు ఎందుకు? ఫలితంగా వచ్చిన నేటి కరువుకు కాంగ్రెస్ ప్రభుత్వం దోషి కాదా? కొడంగల్ నిర్మించుకోండి. తెలంగాణకు నీరందించే తుమ్మిడి హెట్టిని దారుణ నిర్లక్ష్యం చేయకూడదు కదా? ఆర్వి కన్స్ట్రక్షన్‌కు రూ.11.8 కోట్లతో తుమ్మిడి హెట్టి డీపీఆర్‌ను అప్పగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. విఫల సుందిళ్ల బ్యారేజీకి నీళ్లు తరలించే యోచన ప్రకటించింది. ఇదికూడా కేసీఆర్ కాళేశ్వరం లాంటి ఘోర తప్పిదమే అవుతుంది. మూడు బ్యారేజీల పునాది అడుగుంతా బుంగలు పడ్డాయని, మేడిగడ్డ కూలిందని, ఎన్‌డిఎస్‌ఎ ప్రకారం తక్షణమే నీళ్లు నిలపడానికి అనువైన స్థితిలో లేనంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయించింది కాంగ్రెస్. పునాది విధ్వంసమైన విఫల బ్యారేజీకి ప్రతియేటా తుమ్మిడి హెట్టి నుండి వందల టీఎంసీల నీళ్లను తరలిస్తే ఎలా నిలుస్తుంది? మరో కాళేశ్వరాన్ని సృష్టించడం కాంగ్రెస్ లక్ష్యమా?
ముఖ్యమంత్రిని అడ్డుకున్నదెవరు?
మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, నీళ్లు ఎత్తిపోసి నిలిపితే ప్రమాదమని హెచ్చరించారు. 2008లో వైఎస్సార్ శంకుస్థాపన చేసిన తుమ్మిడి హెట్టి బ్యారేజీ డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) ప్రకారం మైలారం మీదుగా దృఢమైన రాతి పునాది గల ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లు తరలించడం అత్యంత అనువైనదని తెలిసినా ఎందుకు పట్టించుకోవడం లేదు. తుమ్మిడిహెట్టి 148 మీటర్ల ఎత్తున నిర్మించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో కేసీఆర్ 2015లోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. 152-160 మీ.కు పునాది వేసుకొని, 148 మీ. ఎత్తున నిర్మించుకోవడానికి రేవంత్ రెడ్డిని అడ్డుకున్నది ఎవరు? ఆటంకాలు ఎదురైనా కర్నాటక ఆల్మట్టిని అనేక మీటర్లు అలానే పెంచింది కదా! ప్రఖ్యాత ఇంజినీర్ టి.హను మంతరావు పేర్కొన్నట్లు కాలువలు నాలుగు మీటర్ల లోతు చేస్తే ప్రాణహిత నది నుండి అంతే నీరును ఎల్లంపల్లికి తరలించవచ్చు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాని మోడీ, కేంద్ర జలశక్తి శాఖతో హేతుబద్ధమైన చర్చలు చేస్తూ 152 మీ.కు ఒప్పించవచ్చు. భావోద్వేగాలతో నీటి సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత ముదురుతాయి. నిర్మాణం చేపట్టకుండా, 152 మీ. పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయడం అత్యంత దుర్మార్గం.
ప్రజల ప్రయోజనమే ప్రాధాన్యం కావాలి
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యానికి బీఆర్ఎస్‌దే బాధ్యత. రాహుల్ గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి కుంగిన మేడిగడ్డ బ్యారేజీపై నిలబడి, తుమ్మిడిహెట్టి నిర్మిస్తామని ఇచ్చిన హామీని వమ్ము చేసి రెండున్నరేండ్లు దాటింది. తుమ్మిడి హెట్టి నిర్మించ డంలో తీవ్ర జాప్యం, దారుణమైన నిర్లక్ష్యానికి కాంగ్రెస్ కూడా దోషినే. కేటీఆర్, బీఆర్‌ఎస్ నాయకులు దిగువ మానేరు సందర్శన, కాంగ్రెస్ మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమ్మక్క బ్యారేజీ సందర్శనా పోటీలు కాదు. వీరందరూ కలిసి, కరువులో తెలంగాణలోనే ఏకైకచోట నీరున్న ప్రాణహిత నది తుమ్మిడిహెట్టిని సందర్శించి, నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలి. ప్రజలకు కరువు నుంచి ఉపశమనం కల్పించడమే ప్రభుత్వాల మొదటి బాధ్యత కావాలి.
నైనాల గోవర్ధన్, 9701381799



